Viral: 70 ఏళ్ల వయసులో డాక్టర్ అయిన వృద్ధుడు! ఎందుకని అడిగితే..
ABN , Publish Date - Sep 09 , 2024 | 05:51 PM
మలేషియాలో ఓ వ్యక్తి 70 ఏళ్ల వయసులో వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ అయ్యారు. ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ముదిమి వయసులో చదువు అభ్యసించి తమ చిరకాల వాంఛను నెరవేర్చుకున్న వారెందరో వార్తల్లోకెక్కారు. పదో తరగతో, డిగ్రీనో పూర్తి చేసి తాము అక్షరాస్యులమని ఘనంగా చాటుకున్నారు. కానీ 70 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి మెడిసిన్ అంతటి వృత్తి విద్యను పూర్తి చేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. మలేషియాలో సరిగ్గా ఇదే ఘటన వెలుగు చూసింది. టెక్ రంగంలో పనిచేసి రిటైర్ అయ్యాక ఆయన డాక్టర్ కావడంతో ప్రస్తుతం ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ (Viral) అవుతోంది.
70 ఏళ్ల వయసులో వైద్య విద్య పూర్తి చేసుకున్న ఈ అసాధారణ వ్యక్తి పేరు టో. ఆయన ఉండేది మలేషియాలో! టెక్ సేల్స్ రంగంలో పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన తన జీవితంలో ఎన్నడూ డాక్టర్ కావాలనుకోలేదు. అయితే, రిటైర్ అయిన తరువాత ఓ సందర్భంలో ఆయనకు కిర్గిస్థాన్‌లో భారతీయ వైద్య విద్యార్థులు తారసపడ్డారు. వారిని చూశాక తనూ వైద్య విద్యను అభ్యసించాలని భావించారు (This 70 Year Old Malaysian Man Just Graduated Medical School).
Viral: వావ్.. ఈ ట్రైన్‌లో ఒక్కసారైనా జర్నీ చేయకపోతే లైఫ్ వేస్ట్!
‘‘ఈ విషయం చెప్పగానే మొదట నా కుటుంబం, స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఇతడికేమైందో అని కంగారు పడ్డారు. ఈ వయసులో వైద్య విద్యను చదవడం ఏంటని ప్రశ్నించారు. నేనైతే జీవితంలో ఏదైనా ఉపయోగకరమైనది చేద్దామనుకున్నాను. నా లైఫ్‌లో నేను చాలా కోర్సులు చేశారు. కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎకనమిక్స్ చేశాను, మళ్లీ అవే చేయదలుచుకోలేదు. నేను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయలేకపోయినా ముసలితనంలో కనీసం నా గురించి నేను జాగ్రత్తలు తీసుకోగలుగుతాను’’ అని ఆయన తెలిపారు.
అయితే, టో ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. తొలుత ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధమైన ఆయన ఆ తరువాత ఆసియాలోని పలు యూనివర్సిటీలకు అప్లై చేశారు. కానీ, వయసు రీత్యా ఆయన దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌లోని సౌత్ వెస్టర్న్ యూనివర్సీటీ గురించి తెలిసింది. 2019లో అడ్మిషన్ రాంగానే ఆయన తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయారు.
ఈ ప్రయాణంలో టో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మూడో సంవత్సరంలో ఆయన పీడియాట్రిక్స్‌లో ఫెయిలయ్యారు. ఆ తరువాత చివరి సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో 30 గంటల షిఫ్టుల్లో కూడా ఆయన పనిచేశారు. అసలు ఇంత కష్టపడటం అవసరమా అని కూడా ఆయనకు అనిపించింది. కానీ, కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థుల మద్దతుతో ముందడుగు వేశారు. ‘‘ 70 ఏళ్ల వయసులో నాకు చూపు మందగించింది. వినికిడి శక్తి కూడా తగ్గింది. యవ్వనం నాటి శక్తిసామర్థ్యాలు లేవు. కానీ ఓ పని మొదలు పెట్టాక పూర్తి చేయకుండా మధ్యలోనే చేతులెత్తేయడం అవమానంగా అనిపించింది. దీంతో, నేను పట్టుదలతో వైద్య విద్యను పూర్తి చేశా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ జులైలోనే ఆయన వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్నారు.