Viral: వావ్.. 100 ఏళ్ల నాటి మంచం.. 300 కేజీల బరువు.. దీనిపై 8 మంది ఒకేసారి నిద్రించొచ్చు!
ABN , Publish Date - May 07 , 2024 | 06:21 PM
సింగిల్ కాట్, డబుల్ కాట్, కింగ్ సైజ్, క్వీన్ సైజ్ బెడ్ల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఏకంగా 8 మంది ఒకేసారి నిద్రించేంతటి పెద్ద మంచాలు.. అదీ ఓ కుగ్రామంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రాజస్థాన్‌లోని నాగ్లా బంద్ గ్రామంలో ఈ మంచాలు దర్శనమిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: సింగిల్ కాట్, డబుల్ కాట్, కింగ్ సైజ్, క్వీన్ సైజ్ బెడ్ల గురించి అందరికీ తెలిసిందే. కానీ ఏకంగా 8 మంది ఒకేసారి నిద్రించేంతటి పెద్ద మంచాలు.. అదీ ఓ కుగ్రామంలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రాజస్థాన్‌లోని నాగ్లా బంద్ గ్రామంలో ఈ మంచాలు దర్శనమిస్తాయి. ఇవి ఎంతగా పాప్యులర్ అంటే వాటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చి వెళుతుంటారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
నాగ్లాబంద్ గ్రామం మరో ప్రత్యేకత ఏంటంటే ఆ గ్రామంలోని వారందరూ ఒకరికొరు బంధువులవుతారు. తమ గ్రామం గురించి స్థానికుడు ఒకరు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ గ్రామంలో కనిపించే మంచాలు సుమారు 100 ఏళ్ల నాటివని అతడు చెప్పుకొచ్చాడు. తాళ్లతో చేసే ఈ మంచం బరువు ఏకంగా 300 కేజీల వరకూ ఉంటుందని వివరించారు.
Viral: ఎవరూ పెళ్లాడని యువతికి కొత్త జీవితం ఇచ్చాడు.. ఈ డాక్టర్ నిజంగా దేవుడే!
దాదాపు శతాబ్దం క్రితం అంటే 1920ల్లో చందేఖాసానా అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన తన ఆరుగురు కొడుకులకు ఆరు భారీ మంచాలను ఇచ్చాడు. నాటి నుంచి ఆ మంచాలు కుటుంబవారసత్వంగా గ్రామంలోనే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ అవి చెక్కుచెదరలేదు. గ్రామంలోని వారు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు (Big Cots where 8 persons can sleep at a time).
ప్రస్తుతం తమ గ్రామంలో 125 కుటుంబాలు ఉన్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. తమ మధ్య బాంధవ్యాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదని అన్నాడు. ఇలాంటి మంచాలు దేశంలో మరెక్కడా లేవని కూడా పేర్కొన్నాడు. తమ పెద్దలకు గుర్తుగా తాము మంచాలను కాపాడుకుంటూ వస్తున్నామని ఆయన తెలిపాడు.