Share News

ఒక్క మెసేజ్‌తో ‘ప్రియ’గా మారిపోయా!

ABN , Publish Date - Oct 27 , 2024 | 06:43 AM

కన్నడ రీమేక్‌ ‘సప్త సాగరాలు దాటి’లో క్యూట్‌ ప్రియ గుర్తుందా? తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది రుక్మిణీ వసంత్‌. తాజాగా ఈ కన్నడ కస్తూరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో నేరుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని ముచ్చట్లివి...

ఒక్క మెసేజ్‌తో ‘ప్రియ’గా మారిపోయా!

కన్నడ రీమేక్‌ ‘సప్త సాగరాలు దాటి’లో క్యూట్‌ ప్రియ గుర్తుందా? తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది రుక్మిణీ వసంత్‌. తాజాగా ఈ కన్నడ కస్తూరి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో నేరుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని ముచ్చట్లివి...

అలా మొదలైంది...

చిన్నప్పటి నుంచి నేను బాగా చలాకీగా ఉండేదాన్ని. 13 ఏళ్ల వయసులో మొదటిసారి రంగస్థలంపై నటించా. ప్రదర్శన పూర్తయ్యాక అందరూ ప్రశంసలతో ముంచెత్తడం ఇప్పటికీ గుర్తే. ఆ సంఘటన నాపై చాలా ప్రభావం చూపింది. అందుకే 15 ఏళ్లకే థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయా. లండన్‌ వెళ్లి ‘రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రమాటిక్‌ ఆర్ట్స్‌’ నుంచి డిగ్రీ పూర్తి చేశా. తిరిగి బెంగళూరు రాగానే ‘బీర్బల్‌’ (కన్నడ) సినిమాలో అవకాశం వచ్చింది. అలా వెండితెరపై నా ప్రయాణం మొదలైంది.


పోస్టర్‌ చూసి...

2020 మార్చిలో ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సంబంధించి డైరెక్టర్‌ ఒక పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అది భలే ఆసక్తిగా అనిపించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇందులో మెయిన్‌ లీడ్‌ కోసం నా వివరాలు తెలియజేస్తూ డైరెక్టర్‌కి ఇన్‌స్టాలో మెసేజ్‌ చేశా. పదిరోజుల తర్వాత ఆడిషన్‌కి రమ్మని రిప్లై వచ్చింది. లుక్‌ టెస్ట్‌ చేసి ఎంపిక చేశారు. నేను ఆ రోజు చేసిన ఒక చిన్న మెసేజ్‌ నాకు ఇంత పెద్ద అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అలాగే ఆ సినిమాలో ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌) ‘సైమా’ అవార్డు అందుకున్నా.

ట్రావెలింగ్‌ ఇష్టం

నటిని కాకపోయుంటే ఫ్యాషన్‌ డిజైనర్‌ని అయ్యేదాన్నేమో. ఖాళీ దొరికితే చాలు నచ్చిన పాటలు పెట్టుకొని ఫుల్‌గా డ్యాన్స్‌ చేస్తా. ఇష్టమైన ప్రదేశాలను అలా సరదాగా చుట్టొస్తా. చిన్నప్పటి నుంచి తరచూ మా కుటుంబం వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అవుతుండడం వల్లేమో... నాకు ట్రావెలింగ్‌పై మక్కువ పెరిగింది.


అలాంటి పాత్రలే చేస్తా...

అందరూ నన్ను ‘క్రష్‌ ఆఫ్‌ కర్ణాటక’ అని పిలుస్తున్నారు. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఈ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకంటూ కొన్ని డ్రీమ్‌రోల్స్‌ ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్‌, రొమాంటిక్‌ సినిమాల్లో నటించాలనుంది. సినిమా ఏదైనా అందులో నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ముఖ్యం.

book1.2.jpg

అమ్మే సర్వస్వం

నేను పుట్టింది బెంగుళూరులోనే అయినా నాన్న వృత్తి రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పెరిగాను. అమ్మ నృత్యకారిణి. నాన్న కల్నల్‌. నాకు పదేళ్లు ఉన్నప్పుడే భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో జరిగిన ఉగ్రదాడిలో నాన్న వీరమరణం పొందారు. ఆయనకు మరణానంతరం ‘అశోక చక్ర’ లభించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ గౌరవాన్ని పొందిన మొదటి వ్యక్తి నాన్నే. ఆయన దూరమైన తర్వాత మేము బెంగుళూరులో సెటిల్‌ అయ్యాం. అప్పటినుంచి అమ్మే నన్ను, నా సోదరిని ఏ లోటు లేకుండా పెంచింది. అమ్మే మాకు సర్వస్వం.


నో మేకప్‌

పరిశ్రమలో చాలామంది నేను ఇంట్రావర్ట్‌ని అనుకుంటారు. నిజానికి అది నా చుట్టూ ఉన్న వాళ్లపై ఆధారపడి ఉంటుంది. వాళ్లు నాలుగు మాటలు మాట్లాడితే చాలు... నేనే అందుకొని గలగలా మాట్లాడేస్తాను. వాళ్లు పెదవి విప్పకపోతే నేనూ సైలెంట్‌గా ఉండిపోతా. నిజ జీవితంలో మేకప్‌ జోలికి పోను. సాధ్యమైనంత వరకు సహజంగా కనిపించడానికే ప్రయత్నిస్తా. ఇక వ్యాయామాలంటారా... ఇండస్ట్రీలో ఉంటున్నామంటే ఆ విషయంలో ఎంతోకొంత శ్రద్ధ చూపక తప్పదుగా మరి.

Updated Date - Oct 27 , 2024 | 06:43 AM