Viral News: ఆ ఊర్లో ముస్లింలకు హిందువుల ఇంటి పేర్లు, గోత్రనామాలు.. ఇలా ఎందుకు చేస్తున్నారంటే..
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:37 PM
అదో విచిత్రమైన ఊరు.. అక్కడి ముస్లింలకు హిందువుల ఇంటి పేర్లు, గోత్రనామాలుంటాయి. వారంతా హిందువుల ఇంటిపేర్లైన దూబె, తివారి, శుక్లా అని పిలిపించుకోవడానికే ఇష్టపడతారు. గత రెండేళ్లుగా ఒక్కొక్కరుగా ఇలా వారి ఇంటిపేర్లను మార్చుకుంటున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే వారిచ్చే సమాధానం ఇది...
తమ మూలాలను మర్చిపోకుండా ఉండేందుకు వ్యక్తులు ఇంటి పేర్లను పేరు చివర ఉంచుకుంటారు. ఇంటి పేరును బట్టే తమ పూర్వీకులను గుర్తిస్తారు. అయితే, ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం ముస్లింలకు హిందువుల ఇంటి పేర్లు ఉండటం గమనార్హం. ఇక్కడి వారంతా సగం ముస్లిం.. సగం హిందువుల పేర్లతో పిలవబడటం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాదు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే ఈ గ్రామం ఈ ఒక్క విశేషం కారణంగా ఇప్పుడు వార్తల్లోకెక్కింది. మరి ఇంతకీ వారు తమ ఇంటి పేరును త్యాగం చేసి మరీ హిందువుల పేర్లను ఇంటి పేరుగా ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలిస్తే షాకవ్వడం మీ వంతవుతుంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ముస్లింలకు దూబే, తివారి వంటి ఇంటిపేర్లు ఉంటాయి. అంతేకాదు వారు పూజలు పునస్కారాలతో పాటు గోమాతను కూడా ఆరాధిస్తుంటారు. జౌన్ పూర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉండే దెహరి గ్రామంలో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. రెండేళ్ల క్రితం కొంతమంది తమ పూర్వీకులను గుర్తించడంతో మొత్తం వారి పద్దతులు, సంప్రదాయాలు మారిపోయాయి. అలాగే వారు తమ ఇంటి పేర్లను కూడా మార్చేసుకున్నారు. నౌషద్ అహ్మద్ అనే వ్యక్తి ఇప్పుడు నౌషద్ దూబేగా మారిపోయాడు. నౌషద్ కూడా తమ పూర్వీకులు హిందువులేనని గుర్తించాడు. తన తండ్రి లాల్ బహదూర్ దూబే ఇస్లాం మతాన్ని స్వీకరించి లాల్ బహదూర్ షేక్ అయ్యాడని తెలుసుకున్నాడు. వారి స్వస్థలం ఆజంగఢ్ అని తెలుసుకున్నాడు. వెంటనే తన ఇంటి పేరు నుంచి షేక్ ను తొలగించి దూబేను చేర్చుకున్నాడు. ఇక అప్పటివరకు అనుసరిస్తున్న మత సంప్రదాయాల్లోనూ మార్పులు చేసుకున్నాడు. అయితే, అతడి ఇంట్లో దూబే మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాడు. తనొక్కడే కాదని.. తనలా ఎంతో మంది తమ పూర్వికులు హిందువులేనని గుర్తించినట్టు తెలిపాడు. నౌషద్ మాట్లాడుతూ..నేను రెండేళ్ల క్రితం నా పూర్వీకుల గురించి తెలుసుకుని షాకయ్యాను. అలాగే నా గోత్రం కూడా తెలుసుకున్నాను. మత సామరస్యాన్ని తీసుకురావడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా ఇంట్లోని ఆ తరం వారు మతం ఎందుకు మార్చుకున్నారో తెలియడం లేదు. రెండు మతాల్లోనూ దేవుడిని పూజించే పద్దతులు వేరుగా ఉండొచ్చు. నేను ప్రస్తుతం ఉన్న నా మతాన్ని వ్యతిరేకించడం లేదు. అలాగని మతం మార్చుకోలేదు. కానీ కేవలం ఇంటి పేరును మార్చుకున్నాను.
నౌషద్ లాగే షేక్ అబ్దుల్లా సైతం షేక్ అబ్దుల్లా దూబేగా మారాడు. తన పూర్వీకుల గురించి తెలుసుకున్న తర్వాతే ఈ మార్పులు చేసుకున్నట్టు తెలిపాడు. మరో నివాసి ఎహ్తెషామ్ అహ్మద్.. తన పూర్వీకులు హిందూ బ్రహ్మణులని కనుగొన్నట్టు తెలిపాడు. అయితే, తాను మాత్రం పేరులో మార్పులు చేసుకోలేదన్నాడు. అయితే ఈ ఊరి వారు ఉన్నట్టుండి రెండేళ్ల క్రితం నుంచే తమ మూలాలను కనుగొనడం ఎందుకు ప్రారంభించారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అయితే ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఇలా ఇంటి పేరును మార్చుకుంటున్నారు.