Share News

Viral News: అడవిలో బంధించిన మహిళ కేసులో భారీ ట్విస్ట్.. భర్తే లేడట

ABN , Publish Date - Aug 05 , 2024 | 09:51 PM

మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ అమెరికన్ మహిళ.. 40 రోజులుగా ఏమీ తినకుండా అడవిలో గొలుసులతో కట్టి ఉన్న వీడియో కొన్ని రోజుల క్రితం నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ కేసులో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

Viral News: అడవిలో బంధించిన మహిళ కేసులో భారీ ట్విస్ట్.. భర్తే లేడట

ముంబయి: మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ అమెరికన్ మహిళ.. 40 రోజులుగా ఏమీ తినకుండా అడవిలో గొలుసులతో కట్టి ఉన్న వీడియో కొన్ని రోజుల క్రితం నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ కేసులో పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బాధితురాలు లలితా కయీకి అసలు భర్తే లేడట. తనను భర్తే అడవిలో బంధించాడని తొలుత చెప్పిన ఆ మహిళ ఇప్పుడు భర్తే లేడని అనడం పోలీసులకు షాక్‌కి గురి చేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జులై 27న అడవిలో 50 ఏళ్ల లలితా కయీ గొలుసులతో కట్టేసి ఉండటాన్ని ఓ గొర్రెల కాపరి గుర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె వివరాలు ఆరా తీశారు.


తన భర్త తనను గొలుసులతో కట్టేశాడని.. 40 రోజులుగా తిండిలేక అల్లాడిపోయాయని ఆమె పోలీసులతో చెప్పింది. వారు ఆమెను రక్షించి, ఆసుపత్రిలో చేర్చించారు. మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో సదరు మహిళ వద్ద లభించిన పత్రాలను చూస్తే ఆమె గత పదేళ్లుగా భారత్ లోనే నివసిస్తున్నట్లు తెలిసింది. మరింత లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. ఆమెకు మతిస్థిమితం లేదని, తనను తానే గొలుసులతో బంధించుకుందని దర్యాప్తులో తేలింది. అసలు ఆమెకు భర్తే లేడని లలితా చెప్పిందంతా అబద్ధమని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న లలితా కయీ ఆరోగ్యం మెరుగవుతున్నకొద్దీ వ్యక్తిగత వివరాలు చెబుతోందని చెప్పారు.


అయితే ఆమె తల్లి అమెరికాలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లలితా గురించి ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వారు వెల్లడించారు. లలితా అమెరికా పాస్‌పోర్ట్ ఫోటో కాపీని, తమిళనాడు చిరునామాతో కూడిన ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద గడువు ముగిసిన వీసా కూడా లభించింది.

For Latest News and National News click here

Updated Date - Aug 05 , 2024 | 09:51 PM