Viral: వాహనదారుడికి షాక్.. రోడ్డుపై వెళుతుండగా హెల్మెట్‌లోని పాము కాటేయడంతో..
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:21 AM
స్కూటీపై వెళుతున్న వాహనదారుడిని అతడి హెల్మెట్లోని పాము కాటేసిన షాకింగ్ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. ఘటన ఎక్కడ జరిగిందీ తెలియనప్పటికీ ఈ దృశ్యాలు జనాలను కలవర పెడుతున్నాయి
ఇంటర్నెట్ డెస్క్: అపాయం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా విషపూరిత పాములు, కీటకాల విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మూలమూలల్లో దాక్కునే ఈ విషపు జీవులు ఓ పట్టాన మనకు కనబడవు. చిన్న చిన్న సందులు, దుస్తులు, షూస్ వంటి వాటిల్లో దాక్కుని ఉంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదంలో పడ్డట్టే. ఓ వ్యక్తి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి స్కూటీమీద వెళుతూ అకస్మాత్తుగా పక్కకు ఒరిగిపోయాడు. కారణం.. అతడి హెల్మెట్లోని పాము ఏకంగా నెత్తిపై కాటేయడమే. హెల్మెట్‌లో పిల్ల నాగు పాము ఉన్న విషయాన్నే అతడు గుర్తించలేదు. ఎప్పటిలాగే హెల్మెట్‌ను దులపకుండా నెత్తికి పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లాక పాము అతడినెత్తిపై సడెన్‌గా కాటువేసింది. దీంతో, అతడిని తెలీని అశక్తత ఆవరించింది. స్కూటీని రోడ్డుకు ఓ పక్కగా ఆపాక అతడు ముందుకు ఒరిగిపోయాడు.
Viral: మాంజాకు చిక్కుకున్న పావురాయిని కాపాడిన మానవతామూర్తులు!
ఇది గమనించిన చుట్టుపక్కల వారు వాహనదారుడి హెల్మెట్ తొలగించి అతడిని తిన్నగా కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో హెల్మెట్‌లోని పాము బయటకు తొంగిచూడటంతో ఒక్కసారిగా దడుసుకున్నారు. ఆ తరువాత పాములను పట్టేవారికి సమాచారం ఇచ్చారు. అతడొచ్చి హెల్మెట్‌లో కర్రతో అటూఇటూ కదపడంతో మరోసారి పాము బయటకు వచ్చింది. మరోవైపు, స్థానికులు వాహనదారుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
వీడియోలో ఇదంతా చూసిన జనాలు భయపడిపోతున్నారు. ఇక హెల్మెట్ పెట్టుకోవాలంటేనే గుండె దడ మొదలవుతుందని కొందరు కామెంట్ చేశారు. పాముల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్లు, బూట్లను ఓసారి దులిపాకే వెసుకోవాలని చెప్పారు. వానాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కొందరు అభిప్రాయపడ్డారు.
Viral: మీ వల్లే నాకీ జాబ్ వచ్చింది.. భారతీయ సీఈఓపై ప్రశంస
కాగా, గతేడాది కూడా దాదాపు ఇలాంటి ఘటన సంచలనంగా మారింది. ఓ వ్యక్తి ఆఫీసులో తన హెల్మెట్ ఓ టేబుల్‌పై పెట్టాడు. పని ముగిశాక ఇంటికెళుతున్న తరుణంలో హెల్మెట్ తీస్తే ఏదో కదులుతున్నట్టు కనిపించింది. లోపలకు తొంగిచూస్తే పాము కనబడటంతో అతడు హడలిపోయారు. వెంటనే జంతుసంరక్షకులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూసి అది నాగుపామని చెప్పడంతో అంతా షాకైపోయారు. చివరకు దాన్ని జాగ్రత్తగా బయటకు తీసి మరో చోట విడిచిపెట్టారు.
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!