Share News

చీకటి వెనుక హెచ్చరికల కాంతులు

ABN , Publish Date - Oct 27 , 2024 | 07:34 AM

పురాణాల్లోని కథల్లో, మన సంస్కృతీ సంప్రదాయాల్లోని పండుగల వెనుక ఎన్నెన్నో జీవన మార్గదర్శక సూత్రాలున్నాయి. వాటిలో దీపావళికి ముందురోజున జరుపుకునే నరకచతుర్దశి వెనుక విశేషమైన కథాపూర్వక హెచ్చరికలున్నాయి.

చీకటి వెనుక హెచ్చరికల కాంతులు

పురాణాల్లోని కథల్లో, మన సంస్కృతీ సంప్రదాయాల్లోని పండుగల వెనుక ఎన్నెన్నో జీవన మార్గదర్శక సూత్రాలున్నాయి. వాటిలో దీపావళికి ముందురోజున జరుపుకునే నరకచతుర్దశి వెనుక విశేషమైన కథాపూర్వక హెచ్చరికలున్నాయి.

దాంపత్యంలో సంతానాన్ని కనటానికి సంబంధించిన సమయ విశేషాలు, పిల్లలను కన్న తరువాత తల్లిదండ్రులు పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచాలి, అలా కాక ఎవరి దోవన వారుండి పిల్లలను పెంచితే వారి పరిస్థితి ఎలా తయారవుతుందనే విషయాలే నరకాసుర కథలో కనిపిస్తాయి. ‘బెస్ట్‌ పేరెంటింగ్‌’ లేనప్పుడు, చెడు స్నేహాలవల్ల కలిగే నష్టాల ప్రతిరూపమే నరకాసుర చరితం.


దీనిలోని అంతరార్ధాన్ని అందరూ గుర్తించాలనే తరతరాలుగా ఈ పండుగను జరపటం మన సంస్కృతీ సంప్రదాయాలలో భాగమైంది. అందుకే ఏదో మొక్కుబడిగా కాక నరకచతుర్దశి వెనుక అంతరార్ధాన్ని గ్రహించాలంటున్నారు పెద్దలు. దైవపరంగానే ఉదాహరణ పూర్వక కథలు చెప్పి మానవాళిని చైతన్య పరచటం భారతీయ సనాతన ధర్మంలోని ఒక లక్షణం. ఈ లక్షణమే జ్ఞానజ్యోతి. ఆ జ్యోతి కాంతులే దీపావళి వెలుగు జిలుగులు.


అసురలక్షణాల ‘నరకుడు’

పూర్వం ఓసారి కృతయుగంలో హిరణ్యాక్షుడు భూమండలాన్ని సముద్రంలో దాచి పెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీమహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకొచ్చాడు. ఆ సమయములో వరాహ అవతారంలోని విష్ణువుకు భూమికి జరిగిన స్పర్శ కారణంగా వారికి ఒక పుత్రుడుకలిగాడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వల్ల పుట్టిన బిడ్డ కనుక ఈ బిడ్డకు అసురలక్షణాలు వస్తాయని, నరకుడు అనే పేరు స్థిరపడుతుందని విష్ణుమూర్తి భూదేవికి చెప్పాడు.


book3.2.jpg

ఆ మాటలకు బాధపడిన భూదేవి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరింది. దానికి విష్ణు మూర్తి సరే అని, తల్లి చేతుల్లలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి అంతర్ధానమయ్యాడు. ఏ తల్లి తన బిడ్డను తాను చంపు కోదని భావించిన భూదేవి అప్పటికి సర్దిచెప్పుకుని సంతోషించింది. తర్వాత నరకుడిని జనకమహారాజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమంది. జనకమహారాజు పర్యవేక్షణలో నరకుడు పెరిగి శక్తిమంతుడయ్యాడు.


నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని పాలిస్తుండే వాడు. కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగ భావిస్తూ చక్కగా పూజ చేస్తుండేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరిని చక్కగా పరిపాలించే వాడు. ఇలా కొంతకాలం గడిచింది. తర్వాత ద్వాపర యుగంలో నరకుడికి శోణితపురానికి రాజైన బాణా సురుడితో స్నేహం కలిగింది. బాణాసురుడు స్త్రీలను భోగవస్తువులాగా భావిస్తుండేవాడు. స్నేహితుడి ప్రభావంతో నరకుడిలో అసుర లక్షణాలొచ్చాయి. నరకాసురుడుగా మారాడు. మెల్లగా అమ్మవారి పూజ ఆపేశాడు. ప్రపంచం లోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరిని బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించాడు. అలా 16 వేల మంది రాకుమార్తెలను బంధించాడు. అమృతాన్ని స్రవించే దేవతల తల్లి అదితి కుండలాలను, వరుణ దేవుడి మహిమాన్వితమైన ఛత్రాన్ని అపహరించాడు. మణిపర్వతం ధ్వంసం చేశాడు. ఇలా ఒకటేమిటి నరకుడు ఎన్నెన్నో దురాగతాలు చేశాడు.


స్వర్గాన్ని ఆక్రమించాడు...

వరాహస్వామి దేవేరి భూదేవికి కలిగిన సంతానమే అయినా దంపతులు కలవకూడని సంధ్యాసమయంలో కలిసిన కారణంగా పుట్టిన ఫలితంగా, స్నేహ ప్రభావంతోనూ నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోయింది. లోక కంటకుడిగా మారిపోయాడు. సకల లోకవాసులను దేవతలనూ అందరినీ హింసించడం ప్రారంభించాడు. చివరికి స్వర్గంపైన కూడా దండయాత్ర చేశాడు. దేవేంద్రుడిని తరిమి స్వర్గాన్ని ఆక్రమించాడు. నరకాసురుడి అకృత్యాలను భరించలేని దేవేంద్రుడు, ముల్లోకవాసులు కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి నరకుడి బాధల నుంచి తమను రక్షించమని వేడుకున్నారు. నరకాసురుడు తల్లి చేతిలోనే మరణిస్తాడని కృష్ణుడికి తెలుసు. అందుకే భూదేవి అంశావతారమైన సత్యభామకు నరకాసురుడిని వధించే అవకాశాన్నిచ్చాడు. నరకాసురుడి వృత్తాంతం మహాభాగవతం దశమ స్కంధం ఉత్తర భాగంలో వుంది. నరకాసురుడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశిని జరుపుకొంటారు. తరువాతి రోజున దీపావళి జరుపుకొంటారు.


శ్రీకృష్ణుడికి సత్యభామ యుద్ధంలో బాగా సహకరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురుడిని కృష్ణుడు అంత మొందించాడు. దీనితో తమ కష్టాలు తొలిగి పోయాయని సంతోషించి మరునాడు సకలలోక వాసులు దీపాలను వెలిగించి సంబరాలను జరుపుకున్నారు. అప్పటి నుంచి ‘దీపావళి’ పండుగ చేసుకోవడం ఆచారంగా వస్తోందని పురాణజ్ఞులు చెపుతున్నారు.

- శ్రీమల్లి, 98485 43520

Updated Date - Oct 27 , 2024 | 07:34 AM