Cheetah Speed: చీతాకు అంతటి వేగం ఎలా సాధ్యమైందంటే..
ABN , Publish Date - Jun 01 , 2024 | 11:43 AM
చీతా అత్యధిక వేగంతో పరిగేత్తేందుకు కారణం దాని శరీర నిర్మాణమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్ప్రింగ్ లాంటి వెన్నెముక, పొడవైన పాదాలు, భారీ పరిమాణంలో ఊపిరితిత్తులు, అధిక శ్వాసరేటు వంటివన్నీ చీతాకు అమిత వేగం అందిస్తాయట.
ఇంటర్నెట్ డెస్క్: నేలపై సంచరించే జంతువుల్లో చీతా (Cheetah) అత్యంత వేగవంతమైనది. కేవలం మూడు సెకెన్లలో ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. చిన్న చిన్న దూరాలను గంటకు 70 మైళ్ల వేగంతో చేరుకోగలదు. మరి ఇంతటి వేగం చీతాకే ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎప్పుడో సమాధానం కనుగొన్నారు. చీతా శరీర నిర్మాణమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పులి, సింహం, చిరుతలతో పోలిస్తే చీతాకు ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు వీటిని అత్యంత వేగవంతమైన జంతువులుగా మార్చేశాయి.
అత్యధిక వేగాన్ని అందుకునేలా చీతా శరీరం ఏరోడైనమిక్ ఆకారంలో ఉంటుంది. దీని బరువు కేవలం 75 నుంచి 150 పౌండ్ల వరకూ మాత్రమే ఉంటుంది. సింహం, పులి, చిరుతతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బరువు తక్కువగా ఉండటంతో ఇది అధిక వేగంతో పరిగెత్తగలదు.
చీతా వెన్నెముక నిర్మాణం కూడా ప్రత్యేకమైనది. స్ప్రింగ్ లాగా పనిచేసే చీతా వెన్నెముక పెద్ద పెద్ద అంగలు (స్ట్రైడ్స్) వేసేందుకు సహకరిస్తుంది. ఉదాహరణకు చీతా ఒక్క అంగలో 26 ఫీట్ల దూరానికి దూకగలదు. నిమిషంలో 150 వరకూ స్ట్రైడ్స్ వేయగల సామర్థ్యం దీని సొంతం. దీనికి తోడు చీతా పాదాల వేళ్లు లోపలికి మణుకుని ఉంటాయి. అవసరమైన సందర్భాల్లో బయటకు వస్తాయి. దీంతో, ఇది పరిగెత్తే సమయంలో చీతా పాదాలు దానికి నేలపై మంచి పట్టునిస్తాయి (What makes cheetah the fastest land animals).
Viral: అనకొండకు ఆహారం అవ్వాలనుకుని.. చివరకు.. షాకింగ్ ఘటన
అత్యధిక వేగంతో ప్రయాణిచేందుకు ఆక్సీజన్ చాలా అవసరం. కాబట్టి, చీతా నాసికారంధ్రాలు.. పులి, సింహం వంటి జంతువులతో పోలిస్తే కాస్తంత పెద్దగా ఉంటాయి. ఇటి ఊపిరితిత్తులు పరిమాణం కూడా పెద్దగా ఉండటంతో వేగంగా పరిగెత్తే సమయంలో చీతాకు కావాల్సినంత ఆక్సీజన్ లభిస్తుంది. ఉదాహరణకు జంతువులను వేటాడే సమయంలో శాస్వతీసుకునే రేటు నిమిషానికి 150కి వరకూ చేరుకుంటుంది. దీంతో, కాళ్ల కండరాలకు తగినంత ఆక్సిజన్ లభించి పరుగులో వెగం అధికమవుతుంది.
చీతా వేగానికి మరో ప్రధాన కారణం దాని తోక. మెరుపు వేగంతో పరిగెత్తే చీతా బ్యాలెన్స్ తప్పి పడిపోకుండా ఉండేందుకు అది తోకను పలు దిశల్లో కదిలిస్తూ ఉంటుంది. బాగా పొడవుండే చీతా తోక అత్యధిగ వేగాలు అందుకునేందుకు సహకరిస్తుంది. చీతా పొడవైన కాళ్లు కూడా ఈ వేగానికి మరో కారణం. చీతా కండరాల్లో ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ సంఖ్య అధికం. ఈ ఫైబర్స్ చాలా వేగంగా, శక్తిమంతంగా సంకోచవ్యాకోచాలకు లోనవుతాయి. దీంతో, చీతా తన కాళ్లను వేగంగా కదపగలదు. వేగంగా పరిగెత్తే చిన్న జీవులకు వేటాడేందుకు అనుగూణంగా చీతా పరిణామం చెందింది. ఇలా పరుగుకు అనువైన శరీర నిర్మాణం కారణంగా చీతా.. సింహం, పులి, చిరుతతో పోలిస్తే అసాధారణ వేగాన్ని అందుకోగలుగుతుంది.
అయితే, చీతా వేగానికి కొన్ని పరిమితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గరిష్ఠ వేగంతో 30 సెకెన్లకు మించి పరిగెత్తలేవు. ఆ తరువాత వాటి కండరాల్లో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి పరుగుకు అడ్డంకిగా మారుతుంది. అందుకే చిరుతలు మాటవేసి మాత్రమే వేటాడతాయి. ఎక్కువ దూరాల మేర అవి జంతువులను వెంట పరిగెత్తలేవు.