Share News

Surya Catch Row: సూర్య క్యాచ్ వివాదం.. బుర్రపెట్టి ఆలోచించమంటూ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:24 PM

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్‌పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్‌ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.

Surya Catch Row: సూర్య క్యాచ్ వివాదం.. బుర్రపెట్టి ఆలోచించమంటూ స్ట్రాంగ్ కౌంటర్
Suryakumar Catch Controversy

టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ (Suryakumar Yadav) పట్టిన చారిత్రాత్మక క్యాచ్‌పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్‌ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు. ముఖ్యంగా.. సౌతాఫ్రికా (South Africa) అభిమానులు ఈ క్యాచ్‌ని తప్పు పడుతున్నారు. భారత్‌కు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే.. బౌండరీ రోప్‌ను వెనక్కు జరిపారని, అందుకు సంబంధించిన మార్క్ కూడా కనిపిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి వారికి తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Akash Chopra) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. బుర్రపెట్టి ఆలోచించమంటూ.. విమర్శకులను సూచించాడు.


ఆకాశ్ చోప్రా విశ్లేషణ

‘‘సూర్యకుమార్ క్యాచ్ పట్టిన ప్రాంతంలో బౌండరీ రోప్‌ను వెనక్కు జరిపారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అక్కడ తెల్లటి లైన్ కూడా కనిపిస్తోందని అంటున్నారు. అవును.. అందరూ చెప్తున్నట్టు అక్కడ బౌండరీ రోప్‌ని కాస్త వెనక్కు జరిపిన మాట వాస్తవమే. కానీ.. ఇక్కడే బుర్రపెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్‌లో పిచ్‌లు చాలా ఉంటాయి. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో పిచ్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకు అనుగుణంగా.. బౌండరీ రోప్‌ను సర్దుబాటు చేయడం జరుగుతుంది. బార్బడోస్‌లోని ఫైనల్ మ్యాచ్ విషయంలోనూ అదే జరిగింది. ఆ మైదానంలో ఎంపిక చేసిన పిచ్‌ని బట్టి.. బౌండరీ లైన్స్‌ని మార్చారు. అలా మార్చకపోతే.. గ్రౌండ్ పరిమాణంలో తేడాలు వస్తాయి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘‘క్యాచ్ పట్టిన సమయంలో సూర్యకుమార్ బౌండరీ రోప్ లోపలే ఉన్నాడు. క్యాచ్ పట్టిన తర్వాత తాను బ్యాలెన్స్ కోల్పోతున్నట్టు అనిపించి.. బంతిని గాల్లోకి విసిరాడు. ఆపై అతను తిరిగి లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్నాడు. అతను పట్టిన క్యాచ్‌లో ఎలాంటి పొరపాటు లేదు. అంతా క్లియర్‌గా ఉండటాన్ని అందరూ గమనించవచ్చు. మైదానంలోని ప్రతీ కెమెరాను పరిశీలిస్తే.. సూర్య కాలు బౌండరీ రోప్‌ని తాకినట్లు ఎందులోనూ కనిపించలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా దీనిపై బురదజల్లుతున్నారు’’ అని వివరించాడు. అంతకుముందు సౌతాఫ్రికా దిగ్గజ షాన్ పొల్లాక్ సైతం.. సూర్య క్యాచ్‌లో ఎలాంటి పొరపాటు లేదని, అది సరైందేనని క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే!


మలుపు తిప్పిన క్యాచ్

ఇదిలావుండగా.. భారత్ సాధించిన విజయంలో సూర్య పట్టిన క్యాచ్ ఎంతో కీలకంగా నిలిచింది. చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా 16 పరుగులు చేయాల్సి ఉండగా.. హార్దిక్ పాండ్యా వేసిన మొదటి బంతికి డేవిడ్ మిల్లర్ భారీ షాట్ కొట్టాడు. మొదట్లో అది సిక్స్‌ దిశగా దూసుకుపోతోందని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే సూర్య వాయువేగంతో దూసుకొచ్చి, అద్భుతమైన రీతిలో దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. ఈ క్యాచ్‌తోనే మ్యాచ్ మలుపు తిరిగింది. డేవిడ్ మిల్లర్ లాంటి డేంజరస్ బ్యాటర్ ఔట్ అవ్వడంతో.. భారత్ విజయం తథ్యమైంది. అందుకే.. ఈ క్యాచ్ పట్టిన సూర్యను బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరించారు. ఫ్యాన్స్ సైతం అతనికి జేజేలు కొడుతున్నారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 02:24 PM