Share News

Team India: అతడు కెప్టెన్‌గా పనికిరాడు.. అందుకు సరైన వ్యక్తి కాదు

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:09 PM

రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. బీసీసీఐ కొత్త కెప్టెన్ వేటలో నిమగ్నమైంది. టెంపరరీగా కాకుండా.. పర్మినెంట్‌గా ఓ సారథిని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.

Team India: అతడు కెప్టెన్‌గా పనికిరాడు.. అందుకు సరైన వ్యక్తి కాదు
Team India Captain

జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయినా.. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు నమోదు చేసింది. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని భారత జట్టు సమిష్టిగా రాణించడం వల్లే అది సాధ్యమైంది. ఈ నేపథ్యంలోనే.. అతనిపై సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ఆటగాడిగా కాస్త నిరాశపరిచినా.. కెప్టెన్‌గా సమర్థవంతంగా రాణించాడని అందరూ కొనియాడుతున్నారు. కానీ.. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) మాత్రం అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా అతడు పనికిరాడని, అసలు అందుకు సరైన వ్యక్తి కాదని బాంబ్ పేల్చాడు. అతని కంటే రుతురాజ్ బెటరని అభిప్రాయపడ్డాడు.


ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘నేనైతే శుభ్‌మన్ గిల్‌ని కెప్టెన్ చేయను. ఎందుకంటే.. కెప్టెన్సీ ఎలా చేయాలో అతనికి తెలీదు. ఈ విషయం ఐపీఎల్-2024 సీజన్‌లోనే తేలిపోయింది. అసలు అతనిలో నాయకత్వ లక్షణాలే లేవు. కేవలం జట్టులో భాగమైనంత మాత్రాన అతడ్ని కెప్టెన్ చేయకూడదు. గత ఐపీఎల్ సీజన్‌లలో అతను అద్భుతంగా రాణించాడు. భారత జట్టు తరఫున కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అయితే.. నాయకత్వ అనుభవం కోసం టీమిండియా అతనిని కెప్టెన్ చేసింది. కానీ.. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించినప్పుడు, అతనిలో నాకు ఆ స్కిల్స్ కనిపించలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అతని కన్నా సంజూ శాంసన్, రిషభ్ పంత్, రుతురాజ్ లాంటి యువ ఆటగాళ్లు టీ20లో భారత జట్టుని నడిపించగలరని తన మనసులోని మాట పంచుకున్నాడు.


కాగా.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ జట్టుకి శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. తన జట్టుని ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్‌లో టైటిల్‌ని సాధించడంతో రెండో సీజన్‌లో ఫైనల్‌కి చేరింది. కానీ.. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో మాత్రం ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చింది. లీగ్ స్టేజ్‌లో భాగంగా.. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలే సాధించింది. అయితే.. అదే శుభ్‌మన్ సారథ్యంలో భారత జట్టు జింబాబ్వే సిరీస్‌ని 4-1 తేడాతో కైవసం చేసుకోవడం గమనార్హం.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 09:09 PM