Share News

David Warner: డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:57 PM

ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతను వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఆస్ట్రేలియా జట్టు...

David Warner: డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
David Warner

ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతను వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టోర్నీ నుంచి ఆస్ట్రేలియా (Australia) జట్టు నిష్క్రమించిన తర్వాత వార్నర్ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటించాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన అతను.. ఇప్పుడు టీ20ల నుంచి కూడా వైదొలిగాడు. తన కెరీర్‌లో ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ కావొచ్చని గతంలో చెప్పినట్లుగానే అతను ఈ పొట్టి ఫార్మాట్‌కు స్వస్తి పలికాడు.


వార్నర్ రిటైర్‌మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించగల వార్నర్ లాంటి ప్లేయర్ మరొకడు దొరకడని పేర్కొన్నాడు. తాను అతనితో కలిసి ఆడానని, గత రెండేళ్ల నుంచి ఐపీఎల్‌లో అతనికి కోచ్‌గానూ పని చేశానని నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. అతని కంపెనీని తాను ఎంతో ఆస్వాదిస్తానని అన్నాడు. ఆస్ట్రేలియా జట్టు కోసం వార్నర్ ఎంతో చేశాడని.. కాబట్టి తాను చేసిన పనికి అతను ఎంతో గర్వపడాలని సూచించాడు. సహచర ఆటగాళ్లు సైతం తాము వార్నర్‌ని మిస్ అవుతామని.. అతను లేని జట్టులో కచ్ఛితంగా మార్పులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు.


ఇదిలావుండగా.. ఇప్పటివరకూ 110 అంతర్జాతీయ టీ20లు ఆడిన వార్నర్‌ 3277 పరుగులు సాధించాడు. అందులో ఒక శతకంతో పాటు 28 అర్థశతకాలు ఉన్నాయి. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసి.. ఈ ఫీట్ సాధించిన మూడో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఐపీఎల్ సహా ఇతర టీ20 లీగుల్లోనూ అద్భుతంగా రాణించిన వార్నర్.. 2021లోనే పొట్టి ఫార్మాట్‌లోనే 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా.. అతను అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలికాడు కాబట్టి, ఐపీఎల్‌లో తన సేవల్ని మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తాడని ఆశించొచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 08:27 PM