Share News

Ben Stokes: మూడో టెస్టులో ఘోర పరాజయం.. బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 19 , 2024 | 03:36 PM

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. భారత్(India) చేతిలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బజ్‌బాల్‌ క్రికెట్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం.

Ben Stokes: మూడో టెస్టులో ఘోర పరాజయం.. బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా.. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్(England) ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. భారత్(India) చేతిలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 434 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బజ్‌బాల్‌ క్రికెట్‌ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. అందుకే.. కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ‘అంపైర్స్ కాల్’(Umpires Call)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ అంపైర్స్ కాల్‌ని పక్కన పెట్టడం శ్రేయస్కరమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ‘‘జాక్‌ క్రాలీ(Zack Crawley) డీఆర్‌ఎస్‌ను గమనిస్తే, బంతి వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లు అనిపించింది. అయితే.. అంపైర్స్ కాల్ ఇవ్వడంతో అతను పెవిలియన్ చేరాల్సి వచ్చింది. రీప్లేలో బాగా గమనిస్తే.. అసలు బంతి స్టంప్స్‌ను తాకినట్టే లేదు. దీంతో.. అంపైర్స్ కాల్ నిర్ణయంపై మేము అయోమయానికి గురయ్యాం. అప్పుడు హాక్‌-ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందని అనిపించింది. ఈ వికెట్ విషయంలో ఏదో తప్పు జరిగిందనే భావన ఉంది. ఈ అంశంలో నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. కానీ.. డీఆర్ఎస్‌లో భాగమైన అంపైర్స్ కాల్ కారణంగా మేము మూడుసార్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇది సరైందా? కాదా? అనేది పక్కన పెడితే.. మేము మాత్రం వికెట్లు కోల్పోయాం’’ అని చెప్పుకొచ్చాడు.


అయితే.. ఈ వికెట్లు కోల్పోవడం వల్లే తాము ఓడిపోయామని చెప్పలేనని, ఎందుకంటే 500+ టార్గెట్‌ను ఛేదించడం అంత తేలికేం కాదని బెన్ స్టోక్స్ వివరించాడు. డీఆర్‌ఎస్‌ సాంకేతికతపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఫీల్డ్‌ అంపైర్లు నిర్వర్తించే విధులు కఠినమైనవేనని, ముఖ్యంగా భారత్‌ వంటి టర్నింగ్‌ పిచ్‌లపై ఇది ఇంకా క్లిష్టంగా ఉంటుందని, ఇలాంటప్పుడు ‘అంపైర్స్‌ కాల్‌’ అనే ఆప్షన్‌ను పక్కన పెడితేనే బాగుంటుందని పేర్కొన్నాడు. ఏదేమైనా.. ప్రస్తుతం తాను దీనిపై ఎక్కువగా మాట్లాడలేనని, లేకపోతే తాము ఓడిపోవడానికి దీనిని సాకుగా చెప్తున్నామని అందరూ భావిస్తారని వెల్లడించాడు. ఈ విధంగా బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఇంతకీ అంపైర్స్ కాల్ ఏంటి?

బ్యాటర్ ఎల్‌బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడని భావించి ఫీల్డింగ్ జట్టు అప్పీల్ చేస్తే.. అప్పుడు ఫీల్డ్ అంపైర్ ‘ఔట్ లేదా నాటౌట్’ ఇస్తాడు. ఒకవేళ అంపైర్ ఔట్ ఇస్తే.. బ్యాటర్‌కు ఈ నిర్ణయంపై సందేహం ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకోవచ్చు. రివ్యూ సమయంలో అంపైర్స్ కాల్ వచ్చిందంటే.. ఫీల్డ్ అంపైర్ ఏదైతే నిర్ణయం (ఔట్) వెలువరించాడో అదే ఫైనల్ అవుతుంది. జాక్ క్రాలీ వికెట్ విషయంలోనూ అదే జరిగింది. ఈ విషయంపైనే బెన్ స్టోక్స్ పై విధంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated Date - Feb 19 , 2024 | 03:36 PM