Harbhajan Singh: ఆ రోజు నుంచీ మా ఇద్దరికీ మాటల్లేవ్.. ధోనీపై హర్భజన్ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 04 , 2024 | 10:59 AM
ధోనీ జట్టులో హర్భజన్ సింగ్ దాదాపు 15 ఏళ్లపాటు సభ్యుడిగా ఉన్నాడు. 31 టెస్టులు, 77 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అయితే, ధోనీని టార్గెట్ చేస్తూ గతంలో చేసిన ఓ కామెంట్ వీరిద్దరి మధ్యా అగ్గిరాజేసింది...
ముంబై: ఎం ఎస్ ధోనీ, హర్భజన్ సింగ్ మధ్య విభేదాలున్నాయనే రూమర్ ఎన్నో ఏళ్లుగా వార్తలోఉంది. తాజాగా ఈ విషయాన్ని హర్భజన్ బయటపెట్టడం అభిమానులను షాక్ కు గురిచేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బజ్జీ ధోనీతో తనకు సంబంధాలు సరిగ్గా లేవని క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరం మాట్లాడుకోక పదేళ్లు పైగానే అవుతుందన్నాడు. వీరిద్దరూ కలిసి 2018 నుంచి 2020 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హర్భజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ సమయంలోనూ వీరిద్దరూ మైదానంలో ఆటకు అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుకున్నట్టు తెలిపాడు. అయితే, ధోనీ తనతో మాట్లాడకపోవడానికి అతని వద్ద పలు కారణాలు ఉండొచ్చని కానీ, తన విషయంలో మాత్రం అలాంటిదేమీ లేదన్నాడు. తామిద్దరం ఎలాంటి కారణం లేకుండానే దూరమైనట్టు వివరించాడు. ధోనీతో ఎన్నో సార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్నాడు. అందుకే మరోసారి అతడిని పలకరించడం ఇష్టపడలేదన్నాడు.
అతడిపై నాకెలాంటి కోపం లేదు. ధోనీ ఏదైనా చెప్పాలనుకుంటే నాతో ఈపాటికే చెప్పేసి ఉండేవాడు. నా కాల్స్ ను స్వీకరించేవారికి మాత్రమే నేను కాల్స్ చేస్తాను. లేదంటే నాకు సన్నిహితంగా ఉండేవారితోనే మాట్లాడతాను. ఒకటి రెండు సార్లు నా మెసేజ్, కాల్స్‌కు స్పందించకపోతే తిరిగి కాల్ చేయను అంటూ హర్భజన్ సింగ్ నొక్కి చెప్పాడు. ఓ సందర్భంలో ధోనీ తన మెసేజ్ లకు స్పందించలేదని.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల్లేవని పరోక్షంగా తెలిపాడు. దీంతో వీరిద్దరి మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న రూమర్లు నిజమనే విషయం వెలుగులోకి వచ్చింది.
వీరిద్దరూ కలిసి టీమిండియాలో లెక్కకు మించి మ్యాచులు ఆడారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన సమయంలోనూ ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. హర్భజన్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. అయితే, ఈ రెండు విజయాల్లోనూ తనకు రావలసిన గుర్తింపు రాలేదని భజ్జీ అసంతృప్తితో ఉన్నాడు. జట్టు గెలుపును ధోనీ గెలుపుగా ప్రచారం చేయడం తనకు ఎలాంటి క్రెడిట్ ను ఇవ్వకపోవడం వంటి విషయాలపై హర్భజన్ చాలాసార్లు ఓపెన్ గానే కామెంట్స్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ ధోనీకి ఇచ్చినంత ప్రోత్సాహం మరో ప్లేయర్ కి ఇచ్చి ఉంటే మాజీ క్రికెటర్లు మరికొంత కాలం ఆడేవారని.. ధోనీ, టీమ్ మేనేజ్మెంట్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మొత్తానికి వీరిద్దరి మధ్య సఖ్యత లేదనే విషయం ఇన్నాళ్లు బహిర్గతమైంది.