IND vs AUS: మంకీగేట్ వివాదం.. మరోసారి లేవనెత్తిన భజ్జీ.. సంచలన కామెంట్స్
ABN , Publish Date - Dec 08 , 2024 | 10:32 AM
భారత్ ఆసిస్ పర్యటనలో ఉన్న సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 2008 నాటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంపైర్ గా ఉన్న స్టీవ్ బక్నర్ చూపిన పక్షపాత వైఖరిని మరోసారి గుర్తుచేస్తూ అతడి దుర్భుద్ధి ఎలా ఉండేదో తెలుపుతూ కొన్ని ఇన్సిడెంట్స్‌ను గుర్తుచేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాటకీయతకు ఏమాత్రం కొదువలేదు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కావలసినన్ని కాంట్రవర్సీలు చుట్టూ చేరుతాయి. ఈ రెండు జట్ల మధ్య గతంలోనూ వివాదాస్పద మ్యాచ్ లు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ ఆసిస్ పర్యటనలో ఉన్న సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 2008 నాటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఆనాడు భారత జట్టు బౌలర్లపై అంపైర్ గా ఉన్న స్టీవ్ బక్నర్ చూపిన పక్షపాత వైఖరిని మరోసారి గుర్తుచేస్తూ అతడి దుర్భుద్ధి ఎలా ఉండేదో తెలుపుతూ కొన్ని ఇన్సిడెంట్స్‌ను గుర్తుచేశాడు.
ఆస్ట్రేలియా పేరు చెప్పగానే భారత అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది ‘మంకీగేట్’ ఎపిసోడ్ మాత్రమే. సిడ్నీ టెస్టును వివాదాస్పదం చేసిన ఈ ప్రత్యేక సిరీస్‌ను ఎప్పటికీ మరువలేం. సైమండ్స్ ఘటన నుంచి కాంట్రవర్శియల్ ఆన్ ఫీల్డ్ కాల్స్ వరకు భారత్ ఎన్నో చూసింది. మ్యాచ్ సందర్భంగా ఆండ్రూ సైమండ్స్, హర్భజన్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇప్పుడు ఆ టెస్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ సిరీస్‌లో అంపైర్ స్టీవ్ బక్నార్ ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసాడు. చాలా అద్భుతంగా ఆడాడు. అయితే, ఇక్కడ అతడు 12వ ఆటగాడి పాత్రను పోషించాడు. మాజీ అంతర్జాతీయ అంపైర్ వికెట్ కీపర్ ఎం ఎస్ ధోనీకి బంతిని స్పష్టంగా ఎడ్జ్ చేసిననప్పటికీ సైమండ్స్‌కి నాటౌట్ ఇచ్చాడు. భారత్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ల బ్యాట్‌ను ఎన్నోసార్లు తాకినా బక్నర్‌కు కనిపించదు. ఔట్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడడు. అప్పీలు చేసినా పట్టించుకోడు’’ అంటూ హర్భజన్ విమర్శలు గుప్పించాడు.
ముఖ్యంగా రెండు సందర్భాల్లో బక్నర్ అంపైరింగ్ విషయంలో భారత అభిమానులు పీకల్లోతు కోపంతో ఊగిపోయారు. ఈ రెండూ సచిన్ టెండూల్కర్ కి సంబంధించినవే కావడం విశేషం. 2003లో గబ్బా, 2005లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కీలకమైన మ్యాచ్‌ల సమయంలో అతడు తీసుకున్న నిర్ణయాలు అభిమానులల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అతని కాలంలో అత్యుత్తమ అంపైర్‌గా పేరున్న బక్నర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 2003లో బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి పెద్ద తప్పు జరిగింది . ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాటర్‌లలో ఒకరైన టెండూల్కర్, జాసన్ గిల్లెస్పీ బౌలింగ్‌లో తప్పుగా ఎల్‌బిడబ్ల్యుగా ఇచ్చాడు. అయితే టీవీ రీప్లేలలో బంతి స్పష్టంగా స్టంప్‌ల మీదుగా వెళుతున్నట్లు చూపించడంతో బక్నర్ తప్పిదం బహిర్గతమైంది. తాను తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని తప్పిదాలు జరిగినట్టు బక్నర్ ఆ తర్వాతి కాలంలో అంగీకరించడం గమనార్హం.