India vs Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ‘పోరాటం’ కాదు.. ఓ చరిత్ర!
ABN , Publish Date - Jun 07 , 2024 | 06:57 PM
భారత కాలమాన ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం...
భారత కాలమాన ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) మెగా టోర్నీ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మాత్రం భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మధ్య జూన్ 9న జరిగే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ప్లేయర్లలోనూ ఈ మ్యాచ్‌పై కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే.. ఇరుజట్ల ప్లేయర్లు మ్యాచ్‌కి ముందు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ పోరాటం కాదని, ఓ చరిత్ర అవుతుందని పేర్కొన్నాడు.
‘‘వరల్డ్‌కప్ టోర్నీల్లో మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా.. పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచం కూడా ఉత్కంఠగా వేచి చూస్తోంది. అయితే.. పాక్‌తో జరగబోయే మ్యాచ్‌ని నేనెప్పుడూ ఓ పోరాటమని అనుకోను. అది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే.. దాయాదుల పోరు భావోద్వేగంతో కూడి ఉంటుంది. ఆనందం, ఆందోళన, బాధ.. ఇలా అన్నింటినీ ప్రేక్షకులు అనుభవిస్తారు. జూన్ 9న జరిగే మ్యాచ్‌లో మేము తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకంగా ఉంటుంది. సమిష్టిగా రాణించి.. ప్రత్యర్థిపై విరుచుకుపడటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా.. ఇప్పటివరకూ ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియాదే పైచేయి. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పాక్ విజయం సాధిస్తే.. మిగతా మ్యాచ్‌లన్నింటిలో ఆ దాయాదిపై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో.. జూన్ 9న జరిగే మ్యాచ్‌లోనూ పాక్‌ను చిత్తుగా ఓడించాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు.. ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్‌పై భారత్ ఘనవిజయంతో తన జర్నీని మొదలుపెట్టింది. అటు.. అమెరికా (యూఎస్ఏ) జట్టుపై ఓటమితో పాక్ ఈ టోర్నీని ప్రారంభించింది. మరి.. 9న జరగబోయే మ్యాచ్‌లో ఈ ఇరుజట్లలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి.
Read Latest Sports News and Telugu News