PM Modi: ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:20 PM
లోక్‌సభ ఎన్నికలు-2024లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్‌ను (272) మించి 293 స్థానాలను కైవసం చేసుకోవడంతో.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే..
లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Polls 2024) ఎన్డీఏ (NDA) మ్యాజిక్ ఫిగర్‌ను (272) మించి 293 స్థానాలను కైవసం చేసుకోవడంతో.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే.. ఆ కూటమి ఎంపీలు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి నాయకుడిగా నరేంద్ర మోదీకి (Narendra Modi) మద్దతు తెలియజేసేందుకు నితీశ్ కుమార్ (Nitish Kumar) వెళ్తున్నప్పుడు.. మోదీతో చేతులు కలిపి, ఆయన పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అయితే.. తన పాదాల్ని తాకొద్దని మోదీ తిరస్కరిస్తూ నితీశ్‌తో కరచాలనం చేశారు. ఆ సమయంలో ఇద్దరూ చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.
మోదీతోనే ఎల్లప్పుడూ ప్రయాణం
అంతకుముందు నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఏ సందర్భంలోనైనా తాను ప్రధాని మోదీతోనే ఉంటానని నొక్కి చెప్పారు. ఇండియా కూటమి నేతలు ఈసారి పొరపాటున గెలిచారని.. దేశం కోసం వాళ్లు ఏమీ చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లందరూ కచ్ఛితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. దేశం ఇకపై బృహత్తర ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతుందని.. మోదీ నేతృత్వంలో తామంతా కలిసి పని చేస్తామని చెప్పారు. ఈ పదేళ్ల కాలంలో దేశం కోసం మోదీ ఎంతో చేశారన్నారు. ఎన్డీఏ పక్షాలన్ని ఏకతాటిపైకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆదివారం మోదీ ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నారని, కానీ ఇవాళే ఆయన ప్రమాణస్వీకారం చేయాలని తాను కోరుకుంటున్నానని నితీశ్ చెప్పుకొచ్చారు.
మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర
ఇదిలావుండగా.. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ కూటమి ఎంపీలతో పాటు ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు, నీతీశ్‌కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మోదీ సమావేశం అవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తూ.. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు.
Read Latest National News and Telugu News