Share News

Cricket News: 463 బంతుల్లో 426 రన్స్.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్

ABN , Publish Date - Nov 10 , 2024 | 08:56 AM

గత రెండు సీజన్లలో అండర్-25గా జరిగిన ‘కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ’ని ఈ ఏడాది అండర్-23గా మార్చారు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్న హర్యానా ఆటగాడు యశ్వర్ధన్ దలాల్‌ అదరగొట్టాడు. శుక్రవారం ముంబైతో ప్రారంభమైన మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

Cricket News: 463 బంతుల్లో 426 రన్స్.. చరిత్ర సృష్టించిన యువ క్రికెటర్
Yashvardhan Dalal

ముంబై: దేశవాళీ క్రికెట్‌లో మరో రికార్డు నమోదయింది. ‘కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ’లో హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ అద్భుతమైన ‘క్వాడ్రపుల్ సెంచరీ’ బాదాడు. మొత్తం 463 బంతులు ఎదుర్కొని 426 పరుగులు బాదాడు. ముంబైపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు స్థాయి స్కోర్ సాధించాడు. అండర్-25గా ఈ టోర్నీని ఈ ఏడాది అండర్-23 ఫార్మాట్‌కు తిరిగి మార్చారు. దీంతో యశ్వర్ధన్ దలాల్‌కు ఆడే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. శుక్రవారం ముంబైతో ప్రారంభమైన మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.


కాగా ముంబై‌తో మ్యాచ్‌లో హర్యానా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో దలాల్‌ ఓపెనర్‌గా వచ్చాడు. తొలి వికెట్‌కు అర్ష్ రంగతో కలిసి 410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వ్యక్తిగత స్కోర్ 151 పరుగుల వద్ద రంగా ఔటవ్వగా దలాల్ స్కోర్ అప్పటికే 243 పరుగులుగా ఉంది.


యశ్వర్ధన్ దలాల్ చూస్తుండగానే 250, 300, 350 పరుగుల స్కోర్లను సాధించి క్వాట్రబుల్ సెంచరీ సాధించాడు. రెండో రోజు సాయంత్రం సెషన్‌లో 400 పరుగుల మార్కును అధిగమించాడు. హర్యానా అప్పటికే 8 వికెట్లు కోల్పోవడంతో వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. మొత్తం 463 బంతుల్లో ఎదుర్కొని 426 పరుగులు సాధించాడు. ఇందులో 46 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. దీంతో 732/8 వద్ద హర్యానా ఇన్నింగ్స్‌ శనివారం ఆట ముగిసింది. ఇన్నింగ్స్‌ను ఇంకా డిక్లేర్ చేయలేదు. ఆదివారం ఆటలో దలాల్ మరిన్ని పరుగులు జోడించే అవకాశాలు ఉన్నాయి.


కాగా ఝజ్జర్‌లో పుట్టిన యశ్వర్ధన్ దలాల్ భారీ స్కోర్లతో వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. డిసెంబర్ 2021లో జరిగిన అండర్-16 లీగ్ మ్యాచ్‌లో 237 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో హర్యానా క్రికెట్ అకాడమీ 40 ఓవర్లలో 452-5 పరుగులు చేసింది. దీంతో ఏకంగా 368 పరుగుల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది.

Updated Date - Nov 10 , 2024 | 08:59 AM