Share News

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో ఊహించని మార్పు.. అతని స్థానంలో..

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:01 PM

టీ20 వరల్డ్‌కప్‌‌లోని సూపర్-8లో భాగంగా.. భారత జట్టు గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో..

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో ఊహించని మార్పు.. అతని స్థానంలో..
India Likely To Make Big Change in Playing XI

టీ20 వరల్డ్‌కప్‌‌లోని (T20 World Cup) సూపర్-8లో భాగంగా.. భారత జట్టు (India) గురువారం ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుతో తాడోపేడో తేల్చుకోవడం కోసం రెడీ అవుతోంది. వాస్తవానికి.. భారత్ ముందు ఆఫ్ఘన్ జట్టు పసికూనే అయినప్పటికీ, దాన్ని అంత తేలిగ్గా తీసిపారెయ్యలేం. మ్యాచ్‌ని మలుపు తిప్పేసే ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు కాబట్టి.. భారత ఆటగాళ్లు తప్పకుండా ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. అంతేకాదు.. వారిని దెబ్బ కొట్టేందుకు అనూహ్య వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. జట్టులో ఓ మార్పు చేశారని సమాచారం.


బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని తెలియడంతో.. ఓ స్పిన్నర్‌ని తీసుకుంటే బెటరని భారత జట్టు మేనేజ్‌మెంట్ భావించిందట. ఈ నేపథ్యంలోనే.. కుల్దీప్ యాదవ్‌ని రంగంలోకి దింపినట్టు తెలిసింది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో అతనిని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టోర్నీలో అర్ష్‌దీప్, బుమ్రా అదరగొడుతున్నారని కాబట్టి.. ఆ ఇద్దరిని జట్టులోనే ఉంచి, సిరాజ్‌పై వేటు వేసి కుల్దీప్‌కు చోటు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. స్పిన్నర్లలో కుల్దీప్‌తో పాటు చాహల్ కూడా బెంచ్‌లో ఉన్నాడు. అయితే.. ఈమధ్య కాలంలో కుల్దీప్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తాచాటుతున్నాడు. అందుకే.. కుల్దీప్‌వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.


ఈ విషయంపై భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఏ ఒక్కరినీ తొలగించాలన్నా చాలా కష్టమే. న్యూయార్క్ పిచ్‌లకు అనుగుణంగా పేస్ బౌలర్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అయితే.. బార్బడోస్‌లోని పిచ్‌లు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇవి స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి.. చాహల్ లేదా కుల్దీప్‌లు ఇక్కడ అవసరం అవుతారు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ లెక్కన.. ఆఫ్ఘన్‌తో జరగబోయే మ్యాచ్‌లో జట్టులో మార్పు అనేది తథ్యమని తెలుస్తోంది. అయితే.. ఎవరిని కన్ఫమ్‌గా తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.

భారత తుది జట్టు (ఇంకా ఖరారు అవ్వాల్సి ఉంది): రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 20 , 2024 | 03:01 PM