Share News

IND vs AFG: రాణించిన సూర్య.. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:03 PM

సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్..

IND vs AFG: రాణించిన సూర్య.. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ ఎంతంటే?

సూపర్-8లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులను నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (53) అర్థశతకంతో దుమ్ముదులిపేయడం, హార్దిక్ పాండ్యా (32) రాణించడంతో.. భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌కు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది మెరుగైన స్కోరే అయినా.. ప్రత్యర్థి జట్టుని ఓడించాలంటే, పటిష్టమైన బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. భారీ షాట్లు ఆడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేయగలగాలి. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీయగలిగితే.. భారత్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత జట్టుకి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. 11 పరుగుల వద్దే కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ (8) అయ్యాడు. అనంతరం పంత్, కోహ్లీ కలిసి.. కాసేపు ఆఫ్ఘన్ బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. ముఖ్యంగా.. పంత్ అయితే చిచ్చరపిడుగులా చెలరేగాడు. కానీ.. ఆ దూకుడులోనే అతడు అనవసరంగా వికెట్ కోల్పోయాడు. ఆ కాసేపటికే కోహ్లీ సైతం పెవిలియన్ బాట పట్టాడు. నిజానికి.. కోహ్లీ క్రీజులో కుదురుకోవడం కోసం, అతడు భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా ఆశించారు. కానీ.. ఆ ఆశల్ని నీరుగారుస్తూ, కేవలం 24 వ్యక్తిగత పరుగులే చేసి ఔట్ అయ్యాడు. శివమ్ దూబే (10) సైతం ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.


అలాంటి టైంలో సూర్య, హార్దిక్ కలిసి ఓ రేంజ్‌లో చితక్కొట్టేశారు. తమ అద్భుత ప్రదర్శనతో.. కష్టాల్లో ఉన్న భారత జట్టుని గాడిలోకి తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా.. సూర్య అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తాను ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా తనదైన ఆటతీరుతో మెరుపులు మెరిపించాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగుల సునామీ సృష్టించాడు. కానీ.. అర్థశతకం చేశాక అనవసరమైన షాట్ ఆడి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రమంగా వికెట్లు పడుతూనే.. మెల్లగా పరుగులూ వచ్చాయి. దీంతో.. భారత్ స్కోరు 181/8గా నమోదైంది.

Updated Date - Jun 20 , 2024 | 10:03 PM