U19 World Cup: సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం.. వరుసగా ఐదోసారి ఫైనల్స్‌లోకి!
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:43 PM
U19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా.. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. భారత్ ఫైనల్స్‌కి చేరుకుంది. ఫలితంగా.. U19 వరల్డ్ కప్‌లో వరుసగా ఐదుసార్లు ఫైనల్స్‌కి చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది.
U19 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా.. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఛేధించి విజయకేతనం ఎగురవేసింది. దీంతో.. భారత్ ఫైనల్స్‌కి చేరుకుంది. ఫలితంగా.. U19 వరల్డ్ కప్‌లో వరుసగా ఐదుసార్లు ఫైనల్స్‌కి చేరుకున్న జట్టుగా టీమిండియా రికార్డ్ నెలకొల్పింది. నిజానికి.. మొదట్లో భారత్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం చూసి.. ఈ మ్యాచ్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ.. కెప్టెన్ ఉదయ్ సహరన్ (81), సచిన్ దాస్ (96) వెన్నెముకలా నిలిచి జట్టుని విజయతీరాలకు చేర్చారు. వీళ్లిద్దరు మెరుగైన ప్రదర్శన కనబర్చడం వల్లే.. భారత్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టగలిగింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా U19 జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రీటోరియస్ (76), రిచర్డ్ (64) అర్థశతకాలతో రాణించడంతో.. ప్రత్యర్థి జట్టు అంత స్కోరు చేయగలిగింది. ఇక 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలుపొందింది. 32 పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు.. సహరన్, సచిన్ ఇద్దరూ కలిసి అద్భుత భాగస్వామ్యం జోడించారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ.. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. మరో వికెట్ వెంటనే పడనివ్వకుండా.. గోడలాగా అడ్డంగా నిలబడిపోయారు. వీళ్లిద్దరు ఐదో వికెట్‌కి ఏకంగా 171 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వీళ్లు ఆడుతున్న తీరు చూసి.. వీళ్లే ఈ మ్యాచ్‌ని ముగించేస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
203 వద్ద సచిన్ వికెట్ కోల్పోయిన భారత జట్టు.. ఆ తర్వాత కొద్దిసేపటికే 226 వద్ద ఒకటి, 227 వద్ద మరొక వికెట్ కోల్పోయింది. ఈ దెబ్బతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా తయారైంది. ఈ మ్యాచ్ చేజారిపోతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. అయితే.. సహరన్ చివరివరకూ క్రీజులో నిల్చొని జట్టుకి ముందుకి నడిపించాడు. 244 పరుగుల వద్ద అతడు ఔటైనా.. అప్పటికే మ్యాచ్ టై అయ్యింది. చివర్లో వచ్చిన రాజ్ లింబానీ విన్నింగ్ షాట్ (ఫోర్) కొట్టి జట్టుని గెలిపించాడు. సహరన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుని ఆదుకోవడంతో.. అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.