India vs South Africa: ఫైనల్ మ్యాచ్.. వాతావరణం ఎలా ఉంది.. మ్యాచ్ జరుగుతుందా?
ABN , Publish Date - Jun 29 , 2024 | 02:36 PM
జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఈరోజు భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. భారత కాలమానం..
జూన్ 2వ తేదీన ప్రారంభమైన టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఈరోజు భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) మధ్య జరగబోయే ఫైనల్ పోరుతో ఈ మెగా టోర్నీ ముగియనుంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8:00 గంటలకు ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమివ్వనున్న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌స్టోన్‌లో వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 70% వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే.. అక్కడి వాతవరణ పరిస్థితులపై అందరి దృష్టి నెలకొంది.
వెదర్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రస్తుతం అక్కడ మబ్బులతో ఆకాశం నిండి ఉంది. అప్పుడప్పుడు సూర్యుడు అతిథిలా కనిపిస్తూ.. మబ్బుల మధ్య దాక్కుంటున్నాడు. అయితే.. (భారత కాలమానం ప్రకారం) సాయంత్రం 4 గంటలకు వర్షం ప్రారంభం కానుందని తెలిసింది. ఇక అప్పటి నుంచి మొదలుకొని.. దాదాపు రెండు గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురవనుందని వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపు ముందు, అంటే రాత్రి 7 గంటలకు వర్షం పూర్తిగా తగ్గుతుందట. అనంతరం కాసేపటివరకు ఆకాశాన్ని మబ్బులు కమ్మేసిన.. టాస్ వేసే సమయానికి వాతావరణం మెరుగుపడే అవకాశం ఉంది. మరి.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అని అనుకుంటున్నారు.
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత మళ్లీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా.. రాత్రి 11 గంటల సమయంలో మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వెదర్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. కాకపోతే.. ఇది ఎక్కువసేపు ఉండదని సమాచారం. దీంతో.. ఎట్టి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ రద్దు అవ్వకుండా, ఈరోజే నిర్వహించేలా ఐసీసీ ప్రణాళికలు రచిస్తోంది. దురదృష్టవశాత్తూ వర్షం నిరంతరంగా పడి మ్యాచ్ రద్దయితే.. రిజర్వ్ డే ఉంది కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఆదివారం కూడా వర్షం పడే సూచనలు ఉండటంతో.. 190 నిమిషాల అదనపు సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది.
Read Latest Sports News and Telugu News