India vs Zimbabwe: ప్రతీకారం తీర్చుకున్న భారత్.. జింబాబ్వేపై ఘనవిజయం
ABN , Publish Date - Jul 07 , 2024 | 08:04 PM
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఘనవిజయం...
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే (Zimbabwe) చేతిలో తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభావానికి భారత జట్టు (Team India) ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. భారత బౌలర్ల ధాటికి 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. 100 పరుగుల తేడాతో టీమిండియా విజయఢంకా మోగించింది. దీంతో.. ఈ సిరీస్‌లో చెరో విజయంతో ఇరుజట్లు సమంగా నిలిచాయి.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (100) శతక్కొట్టడంతో పాటు రుతురాజ్ గైక్వాడ్ (77), రింకూ సింగ్ (48) మెరుపులు మెరిపించడంతో.. భారత్ అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. జింబాబ్వే బ్యాటర్లు తడబడటంతో 134 పరుగులకే కుప్పకూలింది. వెస్లీ (43), ల్యూక్ జాంగ్వే (33) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు భారత బౌలర్ల ధాటికి ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వగా.. అందులో రెండు డకౌట్లు ఉన్నాయి.
భారత బౌలర్లలో.. అభిషేక్ శర్మ మినహాయించి మిగతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్దగా ఆడే అవకాశం ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. అవేశ్ ఖాన్ తన కోటాలో భాగంగా మూడు ఓవర్లు వేసి, కేవలం 15 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత యువ ఆటగాళ్లు ఇదే దూకుడు కొనసాగిస్తే.. సిరీస్ భారత్ కైవసం అవుతుంది. మరి.. మిగతా మ్యాచ్‌ల్లో ఎలా రాణిస్తారో చూడాలి.
స్కోర్లు:
భారత్: 234/2 (20)
జింబాబ్వే: 134/10 (18.4)
Read Latest Sports News and Telugu News