Share News

Simi Singh: హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడుతున్న భారత సంతతి స్టార్ క్రికెటర్

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:06 PM

ఐర్లాండ్ తరఫున 35 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 53 టీ20లు ఆడిన భారత సంతతి ఆల్ రౌండ్ క్రికెటర్ సిమీ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నాడని తెలిపింది.

Simi Singh: హాస్పిటల్‌లో ప్రాణాల కోసం పోరాడుతున్న భారత సంతతి స్టార్ క్రికెటర్
Simi Singh

ఐర్లాండ్ తరఫున 35 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 53 టీ20లు ఆడిన భారత సంతతి ఆల్ రౌండ్ క్రికెటర్ సిమీ సింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం గురుగ్రామ్ ఆసుపత్రిలో ఐసీయూలో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. కాలేయ మార్పిడి కోసం క్రికెటర్ ఎదురుచూస్తున్నాడని తెలిపింది. కాగా సిమీ సింగ్ పంజాబ్‌లోని మొహాలీలో జన్మించాడు. అండర్-14, అండర్-17 స్థాయి క్రికెట్‌ను పంజాబ్ తరపున ఆడాడు. అయితే ఆ తర్వాత అండర్-19 స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలోకి అడుడు పెట్టాలని భావించారు. అందుకు సంబంధించిన అధ్యయనం చేసేందుకు అతడు ఐర్లాండ్ వెళ్లాడు. అక్కడి వెళ్లాక అతడి దృష్టి మళ్లీ క్రికెట్ మీదకే లాగింది. 2006లో డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ క్లబ్‌లో చేరాడు. ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.


సిమీ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై అతడి బావ పర్వీందర్ సింగ్ మాట్లాడారు. ఐదారు నెలల క్రితం సిమీ సింగ్ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న సమయంలో విచిత్రమైన జ్వరం వచ్చిందని, మళ్లీ మళ్లీ వస్తూనే ఉందని, అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయించినా అక్కడ ఏమీ తేలలేదని, అక్కడి వైద్యులు కారణాన్ని గుర్తించలేకపోయారని చెప్పారు. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని ఇండియాకి తీసుకొచ్చామని పర్వీందర్ సింగ్ వెల్లడించారు.


‘‘జూన్ చివరలో సిమీ సింగ్‌ని మొహాలీకి వచ్చాడు. పలువురు వైద్యులను సంప్రదించిన తర్వాత చికిత్స ప్రారంభమైంది. జులై ప్రారంభంలో చండీగఢ్‌లో టీబీ (క్షయవ్యాధి) చికిత్స అందించారు. కానీ ఆ తర్వాత టీబీ లేదని నిర్ధారణ అయింది. ఇక జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో సెకండ్ ఒపీనియన్ కోసం మొహాలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఆగస్టు చివరి వారంలో మేము అతడిని పీజీఐకి (Post Graduate Institute of Medical Education and Research) తీసుకెళ్లాం. ఒక పక్క అతడి ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. తీవ్రమైన కాలేయ వైఫల్య సమస్యకు గురయ్యాడని అక్కడి వైద్యులు గుర్తించారు. గురుగ్రామ్‌లోని మెదాంత హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారు. సిమీ సింగ్ కోమాలోకి వెళ్లే అవకాశం ఉండడంతో విషయం తెలిసిన వెంటనే సెప్టెంబరు 3న అతడిని మేదాంతకు తరలించాం’’ అని పర్వీందర్ సింగ్ వెల్లడించారు.


సిమీ సింగ్ ప్రస్తుతం కాలేయ మార్పిడి చికిత్స కోసం వేచి చూస్తున్నాడని, అతడి భార్య అగందీప్ కౌర్ తన కాలేయంలో ఒక భాగాన్ని దానం చేయడానికి అంగీకరించిందని ఆయన వివరించారు.

కాగా సిమీ సింగ్ మొత్తం 39 వన్డే వికెట్లు, టీ20ల్లో 44 వికెట్లు తీశాడు. ఐర్లాండ్ తరపున ఆడి మంచి పేరు తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడిగా సిమీ సింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో దక్షిణాఫ్రికాపై వన్డే సెంచరీ కూడా సాధించాడు.

Updated Date - Sep 05 , 2024 | 04:09 PM