Share News

Women Asia Cup: అమ్మాయిల విశ్వరూపం.. యూఏఈపై భారత్ ఘనవిజయం

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:37 PM

మహిళల ఆసియా కప్‌లో భాగంగా.. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించి.. మన భారతీయ అమ్మాయిలు..

Women Asia Cup: అమ్మాయిల విశ్వరూపం.. యూఏఈపై భారత్ ఘనవిజయం
India Women vs UAE Women

మహిళల ఆసియా కప్‌లో (Women's Asia Cup) భాగంగా.. ఆదివారం యూఏఈతో (UAE Women) జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు (Team Indian Women) ఘనవిజయం సాధించింది. బ్యాటర్లతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించి.. మన భారతీయ అమ్మాయిలు ప్రత్యర్థిని చిత్తుగా ఓడించారు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ కేవలం 123 పరుగులకే పరిమితం కావడంతో.. 78 పరుగుల తేడాతో భారత్ విజయఢంకా మోగించింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్‌-ఏలో నాలుగు పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో.. సెమీస్‌లో భారత్ బెర్తు దాదాపు కన్ఫమ్ అయ్యింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రిచా ఘోష్ (64), హర్మన్‌ప్రీత్ కౌర్ (66) అర్థశతకాలతో ఊచకోత కోయడంతో పాటు షెఫాలీ వర్మ (37) మెరుపులు మెరిపించడంతో.. భారత జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. టీ20 ఫార్మాట్‌లో మహిళల జట్టు 200 పరుగుల మైలురాయిని దాటడం ఇదే మొదటిసారి. ఇక లక్ష్య ఛేధనలో భాగంగా.. యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితం అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో ఎవరూ పెద్దగా సత్తా చాటలేకపోయారు. కవిశా (40), ఈషా (38) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా చేతులు ఎత్తేశారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. రేణుకా, తనూజా, పూజా, రాధా తలా వికెట్ పడగొట్టారు.


ఈ టోర్నీలో వరుసగా రెండు సాధించిన భారత జట్టు.. మూడో మ్యాచ్‌లో నేపాల్ జట్టుతో తలపడనుంది. ఇది మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులోనూ భారత్ విజయం సాధిస్తే.. గ్రూప్ దశలో క్లీన్ స్వీప్ చేసినట్లు అవుతుంది. కాగా.. ఇదే టోర్నీలో తొలి మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడిన విషయం తెలిసిందే. అందులోనూ మన అమ్మాయిలు అదరగొట్టేశారు. పాక్ జట్టుని చిత్తుచిత్తుగా ఓడించారు. తొలుత పాక్ బ్యాటింగ్ చేసి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. భారత్ 14.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని (109) ఛేధించేసింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 05:37 PM