Share News

Ishan Kishan: ఇషాన్ కిషన్‌కి మరో భారీ దెబ్బ.. కెరీర్ ముగిసినట్టేనా?

ABN , Publish Date - Jul 03 , 2024 | 04:30 PM

యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఎంత మంచి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మూడు ఫార్మాట్లలోనూ (టీ20, వన్డే, టెస్టు) సత్తా చాటి.. భారత జట్టుకి అత్యంత విలువైన ఆటగాడిగా..

Ishan Kishan: ఇషాన్ కిషన్‌కి మరో భారీ దెబ్బ.. కెరీర్ ముగిసినట్టేనా?
Ishan Kishan

యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఎంత మంచి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మూడు ఫార్మాట్లలోనూ (టీ20, వన్డే, టెస్టు) సత్తా చాటి.. భారత జట్టుకి అత్యంత విలువైన ఆటగాడిగా అవతరించాడు. కొన్నిసార్లు తానే సింగిల్ హ్యాండెడ్‌గా జట్టుని గెలిపించిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి ఇషాన్ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐ సెలక్టర్లు అతనిని జట్టులోకి తీసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని అనిపిస్తోంది. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే కారణం.


జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు గాను యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇప్పటికే అక్కడికి వెళ్లింది. అయితే.. ఈ జట్టులో చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమైన యశస్వీ జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్.. బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోవడంతో.. వారి స్థానంలో మరో ముగ్గురిని బీసీసీఐ ఎంపిక చేసింది. వారే హర్షిత్ రాణా, జితేష్ షింగ్, సాయి సుదర్శన్. జింబాబ్వేతో జరగబోయే తొలి రెండు మ్యాచ్‌ల్లో వీళ్లు భారత జట్టులో భాగం కానున్నారు. ఐపీఎల్‌లో ఈ ముగ్గురు మంచి ప్రదర్శన కనబరచడం వల్లే.. జట్టులో స్థానం సంపాదించారు.


అయితే.. ఎన్నోసార్లు తానేంటో నిరూపించుకున్న ఇషాన్ కిషన్‌ని ఎందుకు ఎంపిక చేయలేదన్నది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. సౌతాఫ్రికా టూర్ వరకూ అతడు అన్ని ఫార్మాట్లలోనూ ఆడాడు. కానీ.. ఆ టూర్‌కి విశ్రాంతి అడిగినప్పటి నుంచి ఇషాన్‌కి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆ టూర్, టీ20 వరల్డ్‌కప్ మధ్య చాలానే జరిగాయి. ముఖ్యంగా.. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం లేదని అతనిపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. ఐపీఎల్-2024పైనే అతను ఎక్కువ దృష్టి పెట్టాడు. దాంతో.. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసేసింది. ఇంకా ఇతర పరిణామాల దృష్ట్యా.. బీసీసీఐ సెలక్టర్లు అతనిని పూర్తిగా పక్కన పెట్టేశారు.


క్రీడా వర్గాల సమాచారం ప్రకారం.. ఇషాన్‌ని సెలక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ ఎంపిక ప్రక్రియలో.. అతడు లిస్టులోనే లేడన్న వాదనలు వినిపిస్తున్నాయి. వికెట్ కీపర్ల జాబితాలో రిషభ్ పంత్ అగ్రస్థానంలో ఉంటే.. ఆ తర్వాత సంజూ శాంసన్, ధృవ్ జురేల్, జితేశ్ శర్మ వరుసగా ఉన్నట్లు తెలిసింది. ఈ నలుగురి తర్వాత ఇషాన్ అని, అంతలా అతని పరిస్థితి దిగజారిందని మాట్లాడుకుంటున్నారు. ఇషాన్‌తో పాటు శ్రేయస్ అయ్యర్‌ని కూడా బీసీసీఐ పట్టించుకోకపోవడం గమనార్హం. దేశవాళీ క్రికెట్‌ని చిన్నచూపు చూడటమే.. వారి కెరీర్‌కి గండి కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 04:54 PM