India vs Pakistan: మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్.. ఎప్పుడంటే?
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:58 PM
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. ఆదివారం నసావు కౌంటీ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకూ సాగిన ఈ నరాలు తెగే మ్యాచ్‌లో..
టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) భాగంగా.. ఆదివారం నసావు కౌంటీ వేదికగా భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకూ సాగిన ఈ నరాలు తెగే మ్యాచ్‌లో.. భారత్ ఆరు పరుగుల తేడాతో గెలుపొంది, తన చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యం చెలాయించింది. ఇలాంటి తుణంలో.. భారత్‌తో మరోసారి తలపడేందుకు పాక్ జట్టు సన్నద్ధమవుతోంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. కాకపోతే.. ఆ మ్యాచ్ ఈ మెగా టోర్నీకి సంబంధించింది కాదు. దాని కోసం మరికొన్ని నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఛాంపియన్స్ ట్రోఫీ
పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను నిర్వహించేందుకు ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ టోర్నీ ఫిబ్రవరి-మార్చి మధ్య జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు లాహోర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లను మొదలుపెట్టాలని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) ఐసీసీ సూచించింది. ఈ టోర్నీకి చెందిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ని ఆల్రెడీ ప్రిపేర్ చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. మార్చి 9వ తేదీన చివరి మ్యాచ్ లాహోర్ వేదికగా జరగనుంది. లాహోర్‌లో ఏడు, రావల్పిండిలో ఐదు, కరాచీలో మూడు మ్యాచ్‌లు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఒక చిన్న మెలిక
అయితే.. ఈ టోర్నీ ప్రారంభం కావడానికి ముందు ఓ ముఖ్యమైన విషయం తేలాల్సి ఉంది. పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే.. లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ సాధ్యమవుతుంది. ఒకవేళ భారత ప్రభుత్వం అందుకు ఒప్పుకోకపోతే మాత్రం.. హైబ్రిడ్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. హైబ్రిడ్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తే మాత్రం.. కొన్ని మ్యాచ్‌లను, ముఖ్యంగా భారత మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించవచ్చు. అలా కాకుండా పాక్ అనుకున్నట్టు అన్నీ సవ్యంగా సాగితే.. భారత్‌తో సహా అన్ని మ్యాచ్‌లో పాకిస్తాన్‌లోనే జరగొచ్చు. మరి.. భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు
ఇదిలావుండగా.. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగింది. ఆ టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై 180 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు పాక్ వేదికగా జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో.. భారత్, పాకిస్తాన్‌లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేట్ జట్లు పోటీ పడతాయి. ఈ టోర్నమెంట్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.
Read Latest Sports News and Telugu News