Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీని కోల్పోయే ప్రమాదంలో పాకిస్తాన్.. కారణం బీసీసీఐ కాదట
ABN , Publish Date - Nov 28 , 2024 | 10:46 AM
బీసీసీఐ ప్రమేయం లేకుండానే తమకు తాముగా హైబ్రిడ్ మోడల్ కు పీసీబీ ఒప్పుకోవాల్సి వస్తోంది. మొన్నటి వరకు మ్యాచ్ వేదికపై మొండి వైఖరి ప్రదర్శించిన పాక్ ఇప్పుడు తలొగ్గక తప్పడం లేదు..
కరాచీ: పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై తాజాగా కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. మొన్నటివరకు తమ దేశంలోనే ఈ టోర్నీని నిర్వహించాలంటూ పాకిస్తాన్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తమకు తాముగా మ్యాచ్ వేదికను దేశం నుంచి తరలించాల్సిన పరిస్థితి రావడంతో పీసీబీ సందిగ్దంలో పడింది.
పాకిస్తాన్ లో తాజా రాజకీయ అశాంతి కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్తాన్ నుండి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇటీవల శ్రీలంక ఎ వైట్-బాల్ సిరీస్‌ను మధ్యలోనే వదిలేసి రావలసి వచ్చిందని సమాచారం. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను నిర్ణయించే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు వర్చువల్ సమావేశానికి ఒక రోజు ముందు ఈ పరిణామం తలెత్తడం గమనార్హం. ఈ నేపథ్యంలో మిగిలిన దేశాలు సైతం భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్ల ఈ ఈవెంట్‌ను పాకిస్తాన్ వెలుపల నిర్వహించాలని పీసీబీపై ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడికి తలొగ్గి దీనిని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించడానికి పీసీబీ అంగీకరించే అవకాశం ఉంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున్న నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో మూడు వన్డేల కోసం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టును ఆ దేశం వెనక్కి పిలిపించుకుంది. దీంతో సిరీస్ ను మధ్యలోనే వదిలేసిన శ్రీలంక ఏ జట్టు భద్రతాపరమైన కారణాలతో తిరిగి స్వదేశానికి చేరుకుంది.
2013లో శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టుపై దాడి జరిగిన తర్వాత అంతర్జాతీయ జట్లు ఒక దశాబ్దానికి పైగా పాకిస్తాన్‌కు వెళ్లేందుకు నిరాకరించాయి. ఇటీవలే ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక తమ జట్లను చిన్న పర్యటనలకు పంపాయి. శ్రీలంక ఎ టూర్ రద్దు చేయడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ కు వెళ్లకుండా జాగ్రత్తపడుతోంది.