Mohammad Rizwan: నయా కెప్టెన్‌ను ఎంపిక చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:29 PM
కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ వైదొలగడంతో వన్డేలు, టీ20 ఫార్మాట్లకు నూతన కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. యువ ప్లేయర్ సల్మాన్ అలీ ఆఘాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటన చేశారు.
ఇస్లామాబాద్: వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీగా బాబర్ ఆజమ్ వైదొలగడంతో అతడి స్థానంలో కొత్త సారధిగా స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. యువ ప్లేయర్ సల్మాన్ అలీ ఆఘాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు మీడియా సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటన చేశారు. త్వరలో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లలను పీసీబీ ఇదివరకే ప్రకటించింది. అయితే కెప్టెన్ పేరుని మాత్రం వెల్లడించలేదు. మీడియా సమావేశంలో ప్రకటిస్తామని అన్నారు. ఈ మేరకు మీడియా ముఖంగా ఇవాళ కొత్త పేరుని ప్రకటించారు.
కాగా వన్డే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలగుతున్నట్టు అక్టోబర్‌లో బాబర్ ఆజం ప్రకటించాడు. వ్యక్తిగతంగా ఆటపై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాడు. నిజానికి వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలోనే కెప్టెన్‌గా బాబర్‌ను పక్కన పెట్టారు. అయితే మే నెలలో తిరిగి వన్డే, టీ20 ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించారు. తాజాగా రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించడంతో బాబర్ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి వైదొలగినట్టు అయ్యింది.
కాగా కెప్టెన్‌గా తన అదృష్టం ఏవిధంగా ఉందో మహ్మద్ రిజ్వాన్ త్వరలోనే పరీక్షించుకోబోతున్నాడు. నవంబర్ 4న ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ వన్డే సిరీస్ ఆడనుంది. మెల్‌బోర్న్‌లో తొలి వన్డే జరగనుంది. నవంబర్ 8న రెండవ, 10న మూడవ మ్యాచ్‌లు జరగనున్నాయి. 14వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. కాగా కెప్టెన్ రిజ్వాన్ జింబాబ్వేతో వన్డేల్లో మాత్రమే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌కు వైస్-కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కెప్టెన్‌గా వ్యవరిస్తాడు.
ఆస్ట్రేలియాతో వన్డేలకు పాకిస్థాన్ జట్టు: అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షాహబ్, నసీమ్ షాహబ్ , సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా అఫ్రిది
టీ20లకు జట్టు: అరాఫత్ మిన్హాస్, బాబర్ అజామ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఎ ఫర్హాన్, సల్మాన్ అఘాన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్.