Prithvi Shaw: ఆ మీమ్స్ చూసి బాధపడ్డా.. ట్రోలింగ్ పై పృథ్వీ షా వీడియో వైరల్
ABN , Publish Date - Nov 27 , 2024 | 10:52 AM
తన జీవితమంతా ట్రోలింగ్ కు గురయ్యానని.. ఇకపై కూడా ఇదే జరుగుతుందని యువ బ్యాటర్ పృథ్వీషా అన్నాడు. అదే సమయంలో ట్రోలింగ్ చేసే వారిపై కీలక వ్యాఖ్యలు చేశాడు..
ముంబై: ఐపీఎల్ మెగా వేలంలో ఫ్రాంచైజీలు షాకిచ్చిన క్రికెటర్లలో ముంబై బ్యాటర్ పృథ్వీషా ఒకడు. రూ. 75 లక్షల కనీస బేస్ ప్రైజ్ తో బరిలోకి దిగినప్పటికీ పది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్కరూ అతడిపై ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దీంతో ఈ యువ క్రికెటర్ మరోసారి ట్రోలింగ్ బారినపడ్డాడు. సోషల్ మీడియాలో అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షా పాత వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది.
‘‘ఎవరైనా నన్ను ట్రోల్ చేయాలంటే ముందు నన్ను ఫాలో అవుతారు. దానర్థం అతడి కళ్లన్నీ నామీదే ఉంటున్నాయి. ట్రోలింగ్ అనేది మంచిది కాదు.. అలాగని చెడ్డ విషయమూ కాదు. కేవలం క్రికెటర్లే కాకుండా... ఇతర రంగాల వ్యక్తులనూ ట్రోలింగ్ చేయడం చూస్తున్నాం. నేను అన్ని రకాల ట్రోలింగ్‌ను గమనిస్తూనే ఉంటా. నాపై చేసే మీమ్స్‌ను చూస్తేనే ఉంటా. కొన్నిసార్లు అవి మనల్ని బాధపెడుతుంటాయి. నన్ను బయట చూసిన వారంతా ప్రాక్టీస్ మానేసి తిరుగుతున్నాడని అనుకుంటారు. వాళ్ల దృష్టిలో నేను నా పుట్టిన రోజును జరుపుకోవడానికి కూడా అర్హుడిని కాను. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాని పరిస్థితులు చూశాను. కానీ నేనేం చేసినా తప్పుపట్టేవాళ్లే ఉంటారనే విషయం తెలుసుకున్నాను. నేను చేసే పనిలో తప్పు లేదని అనిపిస్తే.. దానిని అందరికీ కనిపించేలా చేయడానికే చూస్తాను’’ అని షా మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరలవుతోంది.