Share News

RCB vs PBKS: రప్ఫాడించేసిన ఆర్సీబీ.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - May 09 , 2024 | 10:02 PM

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ముదులిపేసింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో.. ఊహించినట్లుగా పరుగుల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల...

RCB vs PBKS: రప్ఫాడించేసిన ఆర్సీబీ.. పంజాబ్ ముందు భారీ లక్ష్యం

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ముదులిపేసింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో.. ఊహించినట్లుగా పరుగుల వర్షం కురిపించింది. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. 92 పరుగులతో విరాట్ కోహ్లీ తాండవం చేయడం, 55 పరుగులతో రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటం, 46 పరుగులతో కెమెరాన్ గ్రీన్ దుమ్ముదులిపేయడం వల్ల.. ఆర్సీబీ ప్రత్యర్థి జట్టుకి 242 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఫాఫ్ డు ప్లెసిస్ (9), విల్ జాక్స్ (12) వికెట్లు పడ్డాయి. అప్పుడు రజత్ పాటిదార్‌తో కలిసి విరాట్ కోహ్లీ జట్టుని నడిపించాడు. వీళ్లిద్దరూ కలిసి భారీ షాట్లతో చెలరేగి.. మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా.. పాటిదార్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. అయితే.. 55 వ్యక్తిగత పరుగుల వద్ద అతను అనవసరమైన షాట్ జోలికి వెళ్లి, కీపర‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కెమెరాన్ గ్రీన్ క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకోగా.. మరోవైపు విరాట్ కోహ్లీ ఊచకోత కోశాడు. ఎడాపెడా షాట్లతో వీరబాదుడు బాదేశాడు. కోహ్లీ ఆడుతున్నంతసేపు.. మైదానం మొత్తం కోహ్లీ కోహ్లీ నినాదాలతో హోరెత్తిపోయింది.

కోహ్లీ ఆడిన తీరు చూసి.. సెంచరీ ఖాయమని అంతా అనుకున్నారు కానీ, దురదృష్టవశాత్తూ 92 వ్యక్తిగత పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అనంతరం డీకే రాగా.. గ్రీన్, అతను కలిసి కొన్ని మెరుపులు మెరిపించారు. ఇది చూసి.. ఆర్సీబీ 250 పరుగుల మార్క్‌ని అందుకుంటుందని అంతా అనుకున్నారు. అయితే.. చివర్లో భారీ షాట్లు పడతాయని ఆశిస్తే ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. కార్తిక్, లామ్రోర్, గ్రీన్ ఒకరి తర్వాత మరొకరు వెనువెంటనే ఔట్ అయ్యారు. ఫలితంగా.. 241/7 పరుగుల వద్ద ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసింది. మరి.. 242 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేధిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Updated Date - May 09 , 2024 | 10:02 PM