Sanju Samson: సారీ చెప్పిన సంజూ.. చేయాల్సిందంతా చేసి ఆఖరికి క్షమాపణలు
ABN , Publish Date - Nov 16 , 2024 | 07:09 PM
సఫారీలతో చివరి టీ20 లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. సెంచరీలతో అదరగొట్టిన సంజూని ఓ ఘటన తీవ్రంగా బాధించినట్టు తెలుస్తోంది.
శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అదరగొట్టాడు. కేవలం 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సంజూ 9 సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా సంజూ శాంసన్ ఓ మహిళా అభిమానికి క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. శాంసన్ కొట్టిన భారీ సిక్సర్ ఓ మహిళా అభిమానిని గాయపరిచింది. దీంతో ఆమె ఆ అభిమాని కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.
సారీ చెప్పిన సంజూ..
డీప్ మిడ్ వికెట్ పైకి వెళ్లిన బంతి చివరకు మహిళ ముఖాన్ని తాకింది. బోరున విలపిస్తున్న ఆ మహిళను పక్కనున్న వారు ఓదార్చారు. గాయం నొప్పిని తగ్గించేందుకు ఐస్ ప్యాక్ తెచ్చిచ్చారు. ఊహించని ఈ ఇన్సిడెంట్ కి సంజూని తీవ్రంగా బాధించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు అక్కడి నుంచి చేతుల ఊపుతూ సారీ చెప్తున్నట్టుగా సైగ చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ బౌలింగ్‌లో శాంసన్ భారీ సిక్స్ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ మ్యాచ్ ప్రత్యేకం..
సౌతాఫ్రికాపై 135 పరుగులతో టీమిండియా విజయాన్ని కైవసం చేసుకుంది. శాంసన్ 56 బంతుల్లో 109 నాటౌట్ గా నిలవగా.. తిలక్ వర్మ సైతం 47 బంతుల్లో 120 నాటౌట్ గా ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత్‌ను 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగుల వద్ద నిలబెట్టారు. ఇది విదేశీ గడ్డపై టీమిండియా అత్యధిక స్కోరు కావడం విశేషం. దక్షిణాఫ్రికా పరుగుల వేటలో, అర్ష్‌దీప్ సింగ్ (3/20) ఓపెనింగ్ స్పెల్ సమయంలో అద్భుతంగా బంతిని స్వింగ్ చేయడంతో ఆతిథ్య జట్టు 4 వికెట్లకు 10 పరుగులకు కుప్పకూలింది. చివరకు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాకు ఇది అత్యంత ప్రత్యేకమైన రికార్డు. ఇద్దరు భారతీయ బ్యాటర్లు ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. శాంసన్, వర్మ టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారతదేశానికి అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రెండవ వికెట్‌కు కేవలం 93 బంతుల్లో 210 పరుగులు తీయడం కూడా అరుదైన రికార్డే.