Virat Kohli: విరాట్ కోహ్లీపై విమర్శలు.. నోళ్లు మూయించిన మాజీ ప్లేయర్
ABN , Publish Date - Jun 13 , 2024 | 05:36 PM
ఐసీసీ టోర్నమెంట్ వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంటాయి. ప్రతిఒక్కరూ అతని నుంచి భారీ ఇన్నింగ్స్ కోరుకుంటారు. ప్రత్యర్థుల్ని మట్టికరిపించేలా...
ఐసీసీ టోర్నమెంట్ వచ్చిందంటే చాలు.. అందరి కళ్లు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే (Virat Kohli) ఉంటాయి. ప్రతిఒక్కరూ అతని నుంచి భారీ ఇన్నింగ్స్ కోరుకుంటారు. ప్రత్యర్థుల్ని మట్టికరిపించేలా కోహ్లీ తన బ్యాట్‌ను ఝుళిపించాలని ఆశిస్తారు. టీ20 వరల్డ్‌కప్‌లోనూ (T20 World Cup) కోహ్లీ నుంచి అదే ప్రదర్శన ఆశించారు. ఐపీఎల్-2024లో అతను టాప్ స్కోరర్‌గా నిలవడం చూసి.. ఈ మెగా టోర్నీలో చితక్కొడతాడని అంతా భావించారు. కానీ.. అందుకు భిన్నంగా కోహ్లీ తేలిపోయాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో (1, 4, 0) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. దీంతో.. అతని ఫామ్‌పై మళ్లీ ఆందోళన నెలకొంది. విమర్శలు కూడా వస్తున్నాయి.
విరాట్ కోహ్లీకి గవాస్కర్ మద్దతు
అయితే.. కోహ్లీ ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, తదుపరి మ్యాచ్‌ల్లో అతను కీలకంగా నిలుస్తాడని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు. ‘‘గతంలో విరాట్ కోహ్లీ భారత్ కోసం ఎన్నో విజయాలను అందించాడు. ఇది అతనికి కచ్ఛితంగా గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ టీ20 టోర్నీలో మనం తొలి దశలోనే ఉన్నాం. ఇంకా సూపర్ - 8, సెమీస్, ఫైనల్స్ ఉన్నాయి. ఇప్పుడు కోహ్లీ చేయాల్సిందల్లా.. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటంతో పాటు కాస్త ఓర్పు పాటించాలి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరు చేసినంత మాత్రాన.. ఒక బ్యాటర్ సరిగా ఆడలేదని కాదు. కొన్నిసార్లు బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. మంచి బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో బ్యాటర్లు ఔట్ అవుతుంటారు. కాబట్టి.. కోహ్లీ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి ఎలా బయటకు రావాలో అతనికి బాగా తెలుసు’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
విరాట్ నమోదు చేసిన స్కోర్లు
ఇదిలావుండగా.. ఈ టీ20 టోర్నీలో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ నిరాశాజనకమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో అయితే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌరభ్ నెట్రవాల్కర్ బౌలింగ్‌లో ఆండ్రీస్ గౌస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మరి.. ఈ నెల 15న కెనడాతో జరగబోయే మ్యాచ్‌లోనైనా కోహ్లీ విజృంభిస్తాడా? లేదా? అనేది చూడాలి.
Read Latest Sports News and Telugu News