Share News

SRH vs MI: సత్తా చాటిన ముంబై బౌలర్లు.. సన్‌రైజర్స్ స్కోరు ఎంతంటే?

ABN , Publish Date - May 06 , 2024 | 09:38 PM

వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ముంబై బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. ఈసారి పవర్‌హిట్టర్స్ చేతులెత్తేయాల్సి వచ్చింది.

SRH vs MI: సత్తా చాటిన ముంబై బౌలర్లు.. సన్‌రైజర్స్ స్కోరు ఎంతంటే?

వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ముంబై బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. ఈసారి పవర్‌హిట్టర్స్ చేతులెత్తేయాల్సి వచ్చింది. ట్రావిస్ హెడ్ (48), కెప్టెన్ పాట్ కమిన్స్ (35) మినహా.. ఎవరూ 20 పరుగుల మార్క్‌ని దాటలేకపోయారు. దీంతో.. ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగలిగింది. ఇది మరీ అంత తక్కువ స్కోరు కాదు కానీ.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తిరగరాసిన రికార్డుల దృష్ట్యా ఇది చిన్న స్కోరుగానే అనిపిస్తోంది.


నిజానికి.. ఓపెనర్లుగా వచ్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ తమ జట్టుకి శుభారంభాన్నే అందించారు. ముఖ్యంగా.. ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడటంతో ఎస్ఆర్‌హెచ్ స్కోరు పరుగులు తీసింది. కానీ.. ఎప్పుడైతే అభిషేక్ ఔట్ అయ్యాడో, అప్పటి నుంచి హైదరాబాద్ జట్టు క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. హెడ్ ఔట్ అయ్యాక జట్టు స్కోరు మరింత నెమ్మదించింది. విధ్వంసకర బ్యాటర్‌ క్లాసెన్ ఈసారి పూర్తిగా నిరాశపరిచాడు. అతడు రెండు పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ సీజన్‌లో బాగా రాణిస్తున్న తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ సైతం అంతగా సత్తా చాటలేకపోయాడు. అతడు 20 పరుగులే చేసి, అవనసరమైన షాట్ జోలికెళ్లి క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇలా వరుసగా వికెట్లు పడుతుండటంతో.. హైదరాబాద్ స్కోరు 150 దాటడం కూడా కష్టంగానే కనిపించింది. అత్యల్ప స్కోరుకే ఇది చాపచుట్టేస్తుందని అంతా భావించారు. కానీ.. ఇంకా నేనున్నానంటూ చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ వచ్చి మెరుపులు మెరిపించాడు. 17 బంతుల్లోనే అతడు 2 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసి.. తన జట్టుని గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి.. 174 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధిస్తుందా? లేక సన్‌రైజర్స్ బౌలర్స్ వారిని లక్ష్యాన్ని చేరుకోకుండా కట్టడి చేయగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

Updated Date - May 06 , 2024 | 09:38 PM