India Vs Bangladesh: కాన్పూర్ టెస్టులో భారత్ సంచలన విజయం
ABN , Publish Date - Oct 01 , 2024 | 03:17 PM
వర్షం అంతరాయం కారణంగా దాదాపు రెండు రోజుల ఆట రద్దైన కాన్పూర్ టెస్టులో భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
కాన్పూర్: వర్షం అంతరాయం కారణంగా దాదాపు రెండు రోజుల ఆట రద్దైన కాన్పూర్ టెస్టులో భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండవ ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. దీంతో టెస్ట్ సిరీస్ 2-0 తేడాతో కైవశం చేసుకుంది.
అంతకుమందు చివరిదైన 5వ రోజున బంగ్లాదేశ్ బ్యాటింగ్ 26/2 వద్ద ప్రారంభమైంది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్లు తీశారు. దీంతో భారత్ విజయలక్ష్యం 95 పరుగులుగా ఖరారైంది.
లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. జైస్వాల్ 51 పరుగులతో రాణించాడు. చివర్లో విరాట్ కోహ్లీ 29, రిషబ్ పంత్ 4 చొప్పున పరుగులు సాధించి భారత్‌ను విజయ తీరాలకు తీసుకెళ్లారు. మిగతా బ్యాటర్లలో రోహిత్ శర్మ (8), శుభ్‌మాన్ గిల్ 6, జైస్వాల్ 51 చొప్పున పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 2 వికెట్లు, తైజుల్ ఇస్లామ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు యశస్వి జైస్వాల్‌కు, ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డ్ రవిచంద్రన్ అశ్విన్‌కు దక్కాయి.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో వేగంగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 95 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది.