T20 WC Final: ఈ ఆటగాళ్లతోనే భారత్‌కు ముప్పు.. కొంచెం తేడా కొట్టినా అంతే!
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:22 PM
టీ20 వరల్డ్‌కప్‌లో ఎన్నో గండాలను దాటుకొని.. భారత జట్టు ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ సొంతం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా...
టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup 2024) ఎన్నో గండాలను దాటుకొని.. భారత జట్టు ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ సొంతం చేసుకోవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా రాత్రి 8:00 గంటలకు జరగనున్న ఈ ఫైనల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఎలాగైతే ఈ టోర్నీలో ప్రత్యర్థుల్ని మట్టికరిపిస్తూ ఫైనల్‌కి చేరుకుందో.. అలాగే ఈ ఆఖరి పోరులో ప్రత్యర్థిని చిత్తుచేసి టైటిల్ కొట్టాలని చూస్తోంది.
అయితే.. సఫారీలను అంత తక్కువ అంచనా వేయలేము. గతంలో పోలిస్తే ఇప్పుడు ఆ జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది. కేవలం ఒకరిద్దరి మీదే ఆధారపడకుండా.. జట్టులోని ఆటగాళ్లందరూ బాగా రాణిస్తున్నారు. సమిష్టి కృషితో సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ సఫారీలు అదరగొడుతున్నారు. ఇలా సమిష్టిగా రాణిస్తున్నారు కాబట్టే.. అజేయంగా ఫైనల్స్‌కి దూసుకొచ్చారు. ముఖ్యంగా.. ఈ జట్టులోని కొందరు ఆటగాళ్లు ఎంతో డేంజరస్. ఈ ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై భారత్ గెలుపొందాలంటే.. ఆ ఆటగాళ్ల విషయంలో తమదైన వ్యూహాలు రచించాలి. ఆచితూచి అడుగులు వేస్తూ.. వారిని కట్టడి చేయగలిగాలి.
ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరంటే..
* క్వింటన్ డీకాక్: ఈ సౌతాఫ్రికా ఓపెనర్ ఎంతో డేంజరస్. ఈ టోర్నీలో అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మెరుపు ఇన్నింగ్స్‌లతో.. నిమిషాల్లోనే మ్యాచ్ రూపురేఖల్ని మార్చేయగల సత్తా అతనిది. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే.. ఇక అతడ్ని అడ్డుకోవడం కష్టమే. కాబట్టి.. వీలైనంత త్వరగా అతనిని పెవిలియన్‌కు చేర్చాలి.
* హెన్రిక్ క్లాసెన్: ఇతను విధ్వంసకర బ్యాటర్. మొదట్లో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు. కానీ.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ముఖ్యంగా.. స్పిన్నర్లలో ఎడాపెడా షాట్లతో చెలరేగిపోతాడు. ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఇతడ్ని కట్టడి చేయాల్సి ఉంటుంది.
* డేవిడ్ మిల్లర్: ఇతను కుదురుకుంటే.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో అతను ‘సేవియర్’గా పేరుగాంచాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన జట్టుని కాపాడి, విజయతీరాలకు చేర్చిన వీరుడతను. తన బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెడితే.. ఇక వీరబాదుడే. కాబట్టి.. అతడ్ని వెంటనే ఔట్ చేయాలి.
* ట్రిస్టన్ స్టబ్స్: ఇతను ఊచకోతకి కేరాఫ్ అడ్రస్. అవును.. క్రీజులో ఎక్కువసేపు ఉండడు కానీ, ఉన్నంతసేపు మాత్రం చుక్కలు చూపిస్తాడు. బౌండరీల మోత మోగించేస్తాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎవరున్నా సరే.. తన బ్యాట్ ఝుళపిస్తాడు. ఐపీఎల్‌లోని పలు మ్యాచ్‌ల్లో ఇతను ఎంతటి విధ్వంసం సృష్టించాడో.. అందరికీ గుర్తుండే ఉంటుంది.
* కగిసో రబాడ: ఈ టోర్నీ మొదట్లో అతని ప్రభావం కొంచెం తగ్గినట్లు అనిపించింది కానీ, ఆ తర్వాత వెంటనే పుంజుకున్నాడు. ఈ టోర్నీలో అతను 18 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో కలిసి ఆడాడు కాబట్టి.. భారత బ్యాటర్ల బలహీనతలు అతనికి బాగానే తెలుసు. కాబట్టి.. అతని బౌలింగ్‌లో ఆచితూచి ఆడాలి.
* ఆన్రిక్ నోకియా: ఈ టోర్నీలో అతగాడు 13 వికెట్లు పడగొట్టాడు. కొన్నిసార్లు విఫలమయ్యాడు కానీ.. పట్టు మాత్రం తప్పలేదు. తనదైన బౌలింగ్ విధానంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. గందరగోళంలో పడేసి.. బ్యాటర్లను ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఒకరకంగా ఇతని పేస్ ఎదుర్కోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే!
* తబ్రేజ్ షంసీ: సౌతాఫ్రికా జట్టులోని ప్రమాదకర స్పిన్నర్లలో ఇతనొకడు. ఈ టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీశాడంటే.. అతని ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాటర్లకు అర్థం కాని రీతిలో బంతులు సంధిస్తూ.. అయోమయానికి గురి చేస్తాడు. అతనిని కాస్త నిర్లక్ష్యం చేసినా.. వికెట్లు పోగొట్టుకోవాల్సిందే.
సౌతాఫ్రికాలో ఇతర ప్లేయర్లు కూడా ప్రభావం చూపుతారు కానీ.. పైన చెప్పుకున్న వాళ్లు మాత్రం చాలా డేంజరస్. ఈ ఏడుగురితో భారత్‌కి పెద్ద ముప్పే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి.. వీరి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆ నలుగురి బ్యాటర్లను వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. ఇక ముగ్గురి బౌలింగ్‌లో వికెట్లు కాపాడుకోగలిగేలా ఆచితూరి ఆడాలి. వీరిని ఎదుర్కొని దూసుకెళ్తే.. భారత్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. మరి.. మన భారతీయులు ఎలా రాణిస్తారో చూడాలి.
Read Latest Sports News and Telugu News