Share News

India vs South Africa: ఫైనల్‌కి వరుణుడి గండం.. రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయితే?

ABN , Publish Date - Jun 28 , 2024 | 08:26 PM

టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి 8:00 గంటలకు..

India vs South Africa: ఫైనల్‌కి వరుణుడి గండం.. రిజర్వ్ డే కూడా మ్యాచ్ రద్దయితే?
India vs South Africa

టీ20 వరల్డ్‌కప్-2024 (T20 World Cup) తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం.. శనివారం (29/06/24) రాత్రి 8:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో ఇరుజట్లు ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. తమ ప్రత్యర్థి జట్లను మట్టికరిపిస్తూ.. ఫైనల్‌కి అజేయంగా దూసుకొచ్చాయి. అందుకే.. ఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


కాకపోతే.. ఈ ఫైనల్ పోరుకి వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ మ్యాచ్ జరిగే సమయంలో 70 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఐసీసీ (ICC).. ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డేని కేటాయించింది. అంటే.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఆదివారం మ్యాచ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ మరో మెలిక కూడా ఉంది. రిజర్వ్ డే నాడు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో.. మ్యాచ్ రద్దు అవ్వకుండా ఉండేందుకు 190 నిమిషాల అదనపు సమయం ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ మ్యాచ్ జరగకపోతే.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది.


ఇదిలావుండగా.. 2013 తర్వాత భారత జట్టు మళ్లీ ఐసీసీ ట్రోఫీలు గెలవలేదు. సెమీస్, ఫైనల్ దాకా వెళ్లి పరాభావాలను చవిచూసింది. దీంతో.. ఈ ఫైనల్‌లో ఎలాగైనా గెలుపొంది, సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టాలని రోహిత్ సేన కోరుకుంటోంది. అందుకు తగ్గ ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు.. సౌతాఫ్రికా జట్టు చరిత్రలోనే తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ కొట్టలేదు కాబట్టి.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ సాధించాల్సిందేనని కసి మీద ఉంది. ఆ కసితోనే ఫైనల్స్‌కు చేరుకుంది. మరి.. ఈ ఇరుజట్లలో ఏది ఆధిపత్యం చెలాయిస్తోంది? ఎవరు టైటిల్ నెగ్గుతారో చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 08:26 PM