Share News

Paris Olympics 2024: ఇలాగైతే కష్టమే.. వివాదాలమయంగా ప్యారిస్ ఒలింపిక్స్..!

ABN , Publish Date - Aug 04 , 2024 | 06:02 PM

Paris Olympics Controversies: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆయా దేశాల అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ 3 పతకాలు సాధించింది.

Paris Olympics 2024: ఇలాగైతే కష్టమే.. వివాదాలమయంగా ప్యారిస్ ఒలింపిక్స్..!
Paris Olympics 2024

Paris Olympics Controversies: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 2024 ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆయా దేశాల అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ 3 పతకాలు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన పారిస్ ఒలింపిక్స్‌లో క్రీడలు, పతకాలతో పాటు అనేక వివాదాలు సైతం కనిపిస్తున్నాయి. తొలిరోజే జరిగిన ఓపెనింగ్ వేడుకలో పెద్ద దుమారం రేగింది. అప్పటి నుంచి వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్‌లో చోటు చేసుకున్న వివాదాలేంటో ఓసారి చూద్దాం.


ప్రారంభోత్సవ వేడుక వివాదం..

ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుక పారిస్‌లోని సెయిన్ నదిపై జరిగింది. ఈ వేడుకలో ప్రదర్శించిన ఒక సీన్.. మతపరమైన వివాదాన్ని రాజేసింది. ఈ సన్నివేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులను ఆగ్రహానికి గురి చేసింది. ప్రఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘ది లాస్ట్ సప్పర్’ పెయింటింగ్‌ను పోలినట్లుగా ఒలింపిక్స్ ప్రారంభోత్స వేడుకలో ప్రదర్శన చేశారు. దీనిపై క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఒలింపిక్స్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఇది ఫ్రెంచ్ సంస్కృతి, సంప్రదాయంలో ప్రసిద్ధి చెందిన గ్రీకు దేవుడు డియోనిసస్‌కు నివాళిగా మాత్రమే ప్రదర్శించామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఏ మతాన్ని తాము కించపరచలేదని అన్నారు.


యాంటీ సెక్స్ బెడ్స్..

పారిస్ ఒలింపిక్స్‌లో యాంటీ సెక్స్ బెడ్‌ల అంశంపై పెద్ద రచ్చే నడిచింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో కూడా అథ్లెట్లకు నిద్రించడానికి యాంటీ సెక్స్ బెడ్‌లు ఇచ్చారు. ఇవి కార్డ్‌బోర్డ్ పడకలు. ఈ యాంటీ సెక్స్ బెడ్స్‌పై చాలా మంది అథ్లెట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లేయర్స్ నుంచి వ్యతిరేకత వస్తుండటంతో వాటిని తొలగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తరువాత ఒలింపిక్ గ్రామంలో దాదాపు 2,30,000 కండోమ్స్ పంపిణీ చేశారట. ఇందులో ఒక్కో అథ్లెట్‌కు 20 కండోమ్స్ అందుకున్నట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి.


జెండర్ వివాదం..

ఒలింపిక్ బాక్సింగ్ రింగ్‌లో ‘జెండర్’ అంశం కూడా పెద్ద వివాదాస్పదమైంది. అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్ విషయంలో ఈ వివాదం చెలరేగింది. ఇటాలియన్ మహిళా బాక్సర్ ఏంజెలా కారినితో ఇమానే ఖెలిఫ్ పోటీ పడింది. ఈ మ్యాచ్ కేవలం 46 సెకన్లలోనే ముగిసింది. ఏంజెలా కారినీ బరిలోంచి నిష్క్రమించింది. 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ‘జెండర్ ఎలిజిబిలిటీ టెస్ట్’లో ఇమానే ఖెలిఫ్ ఉత్తీర్ణత సాధించలేదని, ఇప్పుడు అదే ఇమానే ఖెలిఫ్ పోటీల్లో పాల్గొనడం వివాదాస్పదం అయ్యింది. పురుష లక్షణాలు కలిగిన ఇమానే ఎలా పోటీల్లో పాల్గొంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ ఆడే హక్కు ఉందని స్పష్టం చేసింది. పారిస్ ఒలింపిక్స్‌ 2024 బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనే అథ్లెట్స్ అందరూ అర్హత ప్రమాణాలు, బాక్సింగ్ యూనిట్ నిర్దేశించిన అన్ని వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటారని క్లారిటీ ఇచ్చారు.


సెయిన్ నది కాలుష్యం..

పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుక సెయిన్ నదిపై జరిగింది. మైదానంలో కాకుండా నదిలో ప్రారంభోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ నదిపై కొన్ని క్రీడా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే, ఇప్పుడిదే వివాదాస్పదమైంది. ఈ వేడుకల కారణంగా నదీ కాలుష్యమైందనే ఆరోపణలు వస్తున్నాయి. నదిలో వ్యర్థాలు వేశారని, నదిని కలుషితం చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.


టిండర్ వివాదం..

'టిండర్' వివాదం పారిస్ ఒలింపిక్స్ సమయంలోనూ రచ్చ రేపుతోంది. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు టిండర్ యాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టిండర్ ఒక డేటింగ్ యాప్. అమెరికన్ అథ్లెట్ ఎమిలీ డెలెమాన్ ఒలింపిక్ విలేజ్‌లో టిండర్‌ను వినిగియోస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. టిండర్ ద్వారా పలువురు అథ్లెట్లను కూడా తాను మీట్ అయినట్లు ఎమిలీ చెప్పుకొచ్చింది.


Also Read:

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశ..

సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో

వల్లభనేని వంశీ ఏమయ్యాడు..!?

For More Sports News and Telugu News..

Updated Date - Aug 04 , 2024 | 06:02 PM