Paris Olympics 2024: ఆమె ‘అతనా’..? పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త రచ్చ..!
ABN , Publish Date - Aug 02 , 2024 | 10:15 PM
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో ఒక్క బౌట్.. ఒకే ఒక్క బౌట్..! ఇప్పుడు వివాదానికి కారణమైంది. జెండర్ వివాదానికి తెరలేపింది. మహిళతో పురుషుడు బాక్సింగ్ చేయడం ఏంటని కొందరు వాదించేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్‌లో..
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో ఒక్క బౌట్.. ఒకే ఒక్క బౌట్..! ఇప్పుడు వివాదానికి కారణమైంది. జెండర్ వివాదానికి తెరలేపింది. మహిళతో పురుషుడు బాక్సింగ్ చేయడం ఏంటని కొందరు వాదించేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్‌లో.. ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరాని, అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ తలపడ్డారు. ఇమానె ఖెలిఫ్ పంచ్‌లకు ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరాని నిలువలేకపోయింది. 46 సెకన్లలోనే బౌట్ నుంచి తప్పుకుంది. ఖెలిఫ్‌తో పోటీపై కంటతడి పెట్టింది. అల్జీరియా బాక్సర్ ఇచ్చిన పంచ్ తన ఫేస్‌పై బలంగా తాకిందని చెప్పుకొచ్చింది. రక్తం కూడా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
కెరీర్‌లోనే ఇంతటి పవర్‌ఫుల్ పంచ్‌లు చూడలేదంది. ముక్కు కూడా చాలా నొప్పిగా ఉందని కన్నీరు మున్నీరైంది. పరిణతి చెందిన బాక్సర్‌గా ఆలోచించి బౌట్ నుంచి తప్పుకున్నాననంది. ప్రత్యర్థి జెండర్ గురించి మాట్లాడటానికి తాను ఒలింపిక్స్‌కు రాలేదంది. దీంతో ఏంజెలా కెరాని-ఇమానె ఖెలిఫ్ బౌట్‌పై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఖెలిఫ్‌లో పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. 2023లో ఢిల్లీలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌కు ముందు ఖెలిఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. పురుషుల స్థాయిలో XY క్రొమోజోమ్స్, టెస్టోస్టిరాన్ లెవల్స్ ఉన్నాయని అప్పుడు చర్చ జరిగింది.
DNA పరీక్షల్లో అదే విషయం తేలినట్టుగా కథనాలొచ్చాయ్. భిన్నమైన నిబంధనల కారణంగా ఐఓసీ మాత్రం ఖెలిఫ్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చాన్స్ ఇచ్చింది. ఇక ఇమానె ఖెలిఫ్ వయసు 25 సంవత్సరాలు. అల్జీరియాలోని తియారెట్ ప్రాంతం ఆమెది. తండ్రికి ఇష్టం లేకున్నా బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పతకాలతో తర్వాతి తరానికి స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతోనే ఆటల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2018, 2019 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొంది.
టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. రెండేళ్ల క్రితం వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించింది. 2022లో ఆఫ్రికన్ ఛాంపియన్‌షిప్స్, మెడిటెర్రేనియన్ గేమ్స్‌లో పవర్ చూపించింది. 2023 అరబ్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. అయితే ఇప్పుడు ఒలింపిక్స్‌లో మాత్రం ఇమానె ఖెలిఫ్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు అల్జీరియా బాక్సర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా పాల్గొనే అవకాశం ఇవ్వడం దారుణం అంటున్నారు.