Share News

Vinesh Phogat: వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 11 , 2024 | 10:54 AM

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా స్వర్ణ పతక పోరు ఆడకుండా అనర్హత విధించిన తర్వాత పారిస్‌లో తనకు మద్దతు లభించలేదని ఆమె అన్నారు.

Vinesh Phogat: వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు
Vinesh Phogat

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా స్వర్ణ పతక పోరు ఆడకుండా అనర్హత విధించిన తర్వాత పారిస్‌లో తనకు మద్దతు లభించలేదని ఆమె అన్నారు. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (IOA) చీఫ్ పీటీ ఉష కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని విమర్శించారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు సంఘీభావం తెలపడానికి వచ్చిన పీటీ ఉష తనతో ఒక ఫొటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాజకీయంలో ఒక భాగమని ఫోగట్ ఆరోపించారు.


‘‘ ఎలాంటి మద్దతు దక్కలేదు కాబట్టే నా గుండె బద్దలైంది. లేకుంటే రెజ్లింగ్‌ను వదిలిపెట్టేదాన్ని కాదు. రెజ్లింగ్‌ను వీడొద్దంటూ చాలా మంది చెబుతున్నా నేను వినలేదు. నేను దేని కోసం కొనసాగాలి?. ప్రతిచోటా రాజకీయాలు ఉన్నాయి’’ అని ఫోగట్ పేర్కొన్నారు. ఇక పీటీ ఉష తనతో ఫోటో దిగిన విషయం తెలియదని, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం ఇదని ఆరోపించారు.


‘‘అక్కడ నాకు ఎలాంటి మద్దతు లభించిందో నాకు తెలియదు. పీటీ ఉషా మేడమ్ నన్ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఒక ఫోటో క్లిక్‌మనిపించారు.. మీరు చెప్పినట్లుగానే తలుపులు మూసి ఉన్న గదుల్లో చాలా రాజకీయాలు జరుగుతాయి. అదే విధంగా అక్కడ (పారిస్‌లో) కూడా రాజకీయాలు జరిగాయి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.


‘‘బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశం లేని ఒక ఆసుపత్రిలో బెడ్‌పై నేను ఉన్నాను. జీవితంలో అత్యంత చెత్త దశలలో ఒకదానిని ఎదుర్కొంటున్న ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు.. నాకు అండగా ఉన్నారని అందరికీ చూపించడానికి నాకు చెప్పకుండా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు’’ అని వినేశ్ ఫోగట్ వ్యాఖ్యానించారు. కాగా వినేశ్ ఫోగట్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ కూడా చేస్తున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 11:23 AM