Share News

Vinesh Phogat Video: స్పృహ కోల్పోయి పడిపోయిన వినేశ్ ఫొగట్... అసలేమైంది

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:20 PM

పారిస్ ఒలింపిక్స్‌ 2024 రెజ్లర్‌ పోటీల్లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సోమవారం అస్వస్థతకు గురైంది. స్వగ్రామమైన బలాలీకి చేరుకున్న అనంతరం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vinesh Phogat Video: స్పృహ కోల్పోయి పడిపోయిన వినేశ్ ఫొగట్... అసలేమైంది

ఇంటర్నెట్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌ 2024 రెజ్లర్‌ పోటీల్లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ సోమవారం అస్వస్థతకు గురైంది. స్వగ్రామమైన బలాలీకి చేరుకున్న అనంతరం ఓ కార్యక్రమంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె.. స్పృహ కోల్పోయి కుర్చీలో వెనక్కి వాలినట్లు కనిపిస్తోంది. ప్రొఫెషనల్ రెజ్లర్ భజరంగ్ పునియా ఆమెకు మంచి నీరు ఇచ్చి సపర్యలు చేశాడు. దీంతో ఆమె కోలుకుంది. వినేశ్ కుర్చీపై వాలిపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు.

అయితే రెండు రోజులు ప్రయాణంలోనే ఉన్న ఆమె డీహైడ్రెషన్‌కి గురైనట్లు తెలుస్తోంది. పారిస్ నుంచి 20 గంటలపాటు ప్రయాణం చేసి హరియాణా రాష్ట్రంలోని బలాలీకి చేరుకుంది. అనంతరం గ్రామంలోని మహిళలకు రెజ్లర్ శిక్షణ ఇవ్వడంపై స్థానికులు ఓ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వినేశ్ మాట్లాడుతూ.. "బలాలీ నుంచి మల్లయోధుడు ఎవరూ లేకపోవడం నిరాశగా ఉంది. మా విజయాలతో బాటలు వేసి ఆశలు కల్పించాం. గ్రామంలోని మహిళలకు పురుషులంతా సహకరించాలి. భవిష్యత్తులో రెజ్లింగ్‌లో రాణించి వారు మా స్థానాన్ని ఆక్రమించాలనుకుంటే మీ మద్దతు, ఆశ, నమ్మకం అవసరం" అని వినేశ్ పేర్కొన్నారు.


స్వగ్రామంలో అపూర్వ స్వాగతం..

అంతకుముందు పారిస్‌ నుంచి తిరిగి వచ్చిన రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు ఆమె స్వగ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ విమాశ్రయం నుంచి హరియాణాలోని ఆమె సొంతూరు బలాలీకి చేరుకోవడానికి దాదాపు 13 గంటల సమయం పట్టింది. 135 కిలో మీటర్లు ప్రయాణించి శనివారం అర్ధరాత్రి గ్రామానికి చేరుకొన్న వినేశ్‌కు స్థానికులు నీరాజనం పలికారు. దీంతో ఒక్క సారిగా భావోద్వేగానికి గురైన ఆమెకు.. చుట్టుపక్కల వారు, గ్రామస్థులు వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. తలపాగాతోపాటు ఆమెకు కత్తి ఇచ్చి ఘనంగా సన్మానించిన గ్రామస్థులు.. ఇచ్చిన మాట ప్రకారం గోల్డ్‌ మెడల్‌ (బంగారు పతకం)తో పాటు క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సేకరించిన రూ. 21 వేలను బహుమానంగా అందించారు. ఇదేమీ పెద్ద మొత్తం కాకపోయినా తమ ప్రేమాభిమానాలను ఈ రూపంలో వ్యక్తపరిచారు.

ఓ వాచ్‌మన్‌ రూ. 100.. ఇలా ప్రతి ఒక్కరూ తమ కు తోచినంతగా జమ చేశారు. అంతేకాకుండా 750 కిలోల లడ్డూలను ఫొగట్‌కు కానుకగా ఇచ్చారు. అనంతరం వాటిని ఊరంతా పంచారు. ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో అనర్హతకు గురైన సంగతి తెలిసిందే.


మళ్లీ ఆడతానేమో!

ఒలింపిక్‌ పతకం చేజారడమనేది నా జీవితానికే అతిపెద్ద గాయం. అది మానడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. నాకు దక్కుతున్న ఆదరాభిమానాలను చూస్తుంటే వేగంగా కోలుకొని మళ్లీ రెజ్లింగ్‌లోకి పునరాగమనం చేస్తానేమోననిపిస్తోంది. నా రికార్డులను నా గ్రామం వారే అధిగమించాలి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత ఏడాది కాలంగా మేము చేస్తున్న పోరాటం కొనసాగిస్తాం. దేవుడి దయతో నిజం బయట పడుతుంది.

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 12:27 PM