WhatsApp: ‘అలాంటి’ వీడియోల కలకలం.. వాట్సాప్ సరికొత్త పరిష్కారం
ABN , Publish Date - Feb 20 , 2024 | 03:03 PM
ఈమధ్య కాలంలో ‘డీప్‌ఫేక్’ వీడియోలు(Deepfake Videos) ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు దుండగులు డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి.. నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రష్మిక మందణ్ణ(Rashmika Mandanna)తో పాటు మరెందరో నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు బయటకు రావడం అందరినీ కలవరపెడుతోంది.
ఈమధ్య కాలంలో ‘డీప్‌ఫేక్’ వీడియోలు(Deepfake Videos) ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు దుండగులు డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి.. నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రష్మిక మందణ్ణ(Rashmika Mandanna)తో పాటు మరెందరో నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు బయటకు రావడం అందరినీ కలవరపెడుతోంది. ఈ తరుణంలోనే.. కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే.. మెటా(Meta) సంస్థ సరికొత్త పరిష్కార మార్గాన్ని తెరమీదకి తీసుకొచ్చింది. డీప్‌ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు గాను వాట్సాప్(WhatsApp)లో ‘ఫ్యాక్ట్-చెకింగ్ హెల్ప్‌లైన్’ (Fact-checking Helpline) సేవల్ని ప్రారంభించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం ‘మిస్ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయన్స్’(The Misinformation Combat Alliance), మెటా సంస్థ కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాయి. ఈ హెల్ప్‌లైన్ 2024 మార్చి నెల నుంచి యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల ద్వారా సృష్టిస్తున్న వీడియోల వ్యాప్తిని అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశమని మెటా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ హెల్ప్‌లైన్ ఎలా పని చేస్తుంది?
యూజర్లకు ఈ హెల్ప్‌లైన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటుంది. తమకు డీప్‌ఫేక్ వీడియోలు కంటపడినప్పుడు.. వాటిని వాట్సాప్ చాట్‌బాట్‌కు పంపించేందుకు ఈ హెల్ప్‌లైన్ అనుమతి ఇస్తుంది. ఆ వీడియో కంటెంట్‌ని అంచనా వేసేందుకు, ధృవీకరించేందుకు.. MCA ఒక 'డీప్‌ఫేక్ అనాలిసిస్ యూనిట్'ని ఏర్పాటు చేస్తుంది. డీప్‌ఫేక్‌ల ప్రాబల్యాన్ని గుర్తించడం, నిరోధించడం, అవగాహన పెంచడంపై దృష్టి సారించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవడానికి.. అలాగే విశ్వసనీయ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు గాను యూజర్లను అనుమతించే కీలక సాధనాన్ని రూపొందించడం కూడా ఇందులో భాగమై ఉంటాయి.
దీనిపై పబ్లిక్ పాలసీ ఇండియా, మెటా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్ మాట్లాడుతూ.. తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన తప్పుడు సమాచారం గురించి ఆందోళనలను గుర్తించామన్నారు. దీనిని ఎదుర్కోవడం కోసం కచ్చితమైన, సహకార చర్యలు అవసరమని తాము నమ్ముతున్నామన్నారు. 2024 ఎన్నికల్లో ఏఐ మోసపూరిత వినియోగాన్ని, డీప్‌ఫేక్ వీడియోలను తొలగించడానికి వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించేందుకు ఎంసీఏతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.