Samsung Ring: స్మార్ట్ ఉంగరాన్ని విడుదల చేసిన సామ్సంగ్.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ABN , Publish Date - Oct 23 , 2024 | 08:24 PM
చాలా స్టైలిష్‌గా, యూజర్లకు బాగా ఉపయోగపడేలా దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం సామ్సంగ్ సరికొత్తగా ఓ స్మార్ట్ రింగ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధర, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం సామ్సంగ్ (Samsung) ఉంగరాన్ని విడుదల చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా?.. మీరు చదివేది నిజమే. కాకపోతే ఇది స్మార్ట్ రింగ్. భారత్‌లో టెక్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘గెలాక్సీ రింగ్’ను ఎట్టకేలకు సామ్సంగ్ కంపెనీ విడుదల చేసింది. చాలా స్టైలిష్‌గా, యూజర్లకు బాగా ఉపయోగపడేలా అదిరిపోయే డివైజ్‌తో ఈ రింగ్‌ను కంపెనీ తయారు చేసింది. చూడడానికి ఆకర్షణీయంగా టైటానియం డిజైన్‌లో తీర్చిదిద్దిన ఈ స్మార్ట్ ఉంగరం.. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ రంగులలో లభిస్తోంది.
ధర, ఫీచర్లు ఇవే
ప్రీమియం ప్రొడక్ట్ అయిన సామ్సంగ్ గెలాక్సీ రింగ్ ధరను రూ.38,999గా కంపెనీ నిర్ణయించింది. ఆధునిక ఫీచర్లు, అధిక నాణ్యతతో తయారు చేయడంతో ఈ రింగ్ ధర ఆ స్థాయిలో ఉంది. ఇక ఈ రింగ్ ఫీచర్ల విషయానికి వస్తే ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, హార్ట్ రేట్ ఎలా ఉంది వంటి ఆరోగ్య సంబంధ విషయాలను ఇది ట్రాక్ చేస్తుంది. అంతేకాదు స్పోర్ట్స్ యాక్టివిటీను కూడా గమనిస్తుంది. ఈ రింగ్ నీటిలో తడిచినా పాడవ్వదు. 100 మీటర్ల లోతు వరకు నీటిలో దీనిని ముంచినా చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం కూడా బావుంది. 18 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 6 రోజుల వరకు పనిచేస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. గెలాక్సీ రింగ్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ ఫాస్ట్‌కు ఎక్కుతుంది. రింగ్‌ను ఛార్జింగ్ ప్యాడ్‌లో ఉంచి ఛార్జ్ చేయవచ్చు.
ఏఐ ఆధారంగా హెల్త్ ట్రాకింగ్
గెలాక్సీ రింగ్‌ను ఏఐ సాంకేతికతతో తయారు చేయడంతో ఇది యూజర్ల ఆరోగ్యానికి సంబంధించిన డేటా కచ్చితత్వంతో గుర్తించి రికార్డు చేస్తుంది. యూజర్లు నిద్రపోతున్న విధానంతో సహా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ‘సామ్సంగ్ హెల్త్’ (Samsung Health) యాప్‌కు ఈ రింగ్ అనుసంధానమై ఉంటుంది.
మొత్తంగా ఫ్యాషన్‌గా కనిపించడంతో పాటుగా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందించేలా ఈ ఉంగరాన్ని సామ్సంగ్ తయారు చేసింది. మరోవైపు స్మార్ట్ఫోన్ల చరిత్రలోనే తొలిసారి, సంచలనాత్మక రీతిలో ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సామ్సంగ్ కంపెనీ సిద్ధమైంది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది.