Sithakka: అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి
ABN , Publish Date - Aug 22 , 2024 | 12:06 PM
అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమం జరిగింది. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా.. ఆయన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
హైదరాబాద్: అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమం జరిగింది. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేయగా.. ఆయన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా ఏఐసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి సీతక్క సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆదాని అక్రమాలపై అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాని అక్రమాలపై విచారణ చేయాల్సిన సెబీ పెద్దలే ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయని సీతక్క పేర్కొన్నారు.
హిండెన్ బర్గ్ అనే సంస్థ ఆదాని అక్రమాలపై ఆధారాలు కూడా బయటపెట్టిందని సీతక్క పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఆదాని వేరు వేరు కాదన్నారు. ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ప్రజల ఆస్తులను కాజేస్తున్నారని ఎంతో కాలం క్రితమే రాహుల్ గాంధీ చెప్పారని సీతక్క తెలిపారు. అప్పట్లో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఆదాని తప్పులపై మాత్రం చర్యలు లేవన్నారు. ఆదాని అవకతవకలపై చర్యలు చేపట్టాల్సిన సెబి పెద్దలే అతనితో చేతులు కలిపారన్నారు. తల్లి దయ్యమైతే పిల్లలను ఎవరు కాపాడాలని సీతక్క ప్రశ్నించారు. దేశ సంపదను ఆదాని కొల్లగొడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలకు దిక్కెవరని నిలదీశారు. ఆదాని అక్రమాలపై విచారణ చేయాలని ఈడి ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నామని సీతక్క పేర్కొన్నారు.
రాజకీయ కక్షల కోసం ఈడీని వాడుకుంటున్న కేంద్రం ఆదాని అక్రమాలపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. అతని అక్రమాలపై తాము ధర్నాలు చేస్తుంటే బీజేపీ మెప్పుకోసం బీఆర్ఎస్ పాకులాడుతోందని సీతక్క విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు రైతు రుణమాఫీ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందన్నారు. పది ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేనిది తాము 100 రోజుల్లోనే చేసి చూపించామన్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులందరికీ మాఫీ చేస్తామన్నారు. ఆదాని సక్రమ వ్యాపారాలు చేస్తే అభ్యంతరం లేదు కానీ పెట్టుబడులకు, దోపిడీకి ఎంతో తేడా ఉందన్నారు. ఈ వాస్తవాన్ని టీఆర్ఎస్ గుర్తించాలన్నారు. ఆదాని అక్రమాలపై తమ వైఖరి ఏంటో బీఆర్ఎస్ స్పష్టం చేయాలని సీతక్క పేర్కొన్నారు.