Share News

‘సమూహ’ సదస్సుపై ఏబీవీపీ దాడి!

ABN , Publish Date - Apr 29 , 2024 | 03:57 AM

హనుమకొండ, కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనెట్‌హాల్‌లో ఆదివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అనే అంశంపై సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ఏబీవీపీ కార్యకర్తలు, పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు.

‘సమూహ’ సదస్సుపై ఏబీవీపీ దాడి!

  • కేయూ క్యాంప్‌సలో రగడ

  • సభావేదికపైకి దూసుకొచ్చి బ్యానర్ల చించివేత

  • అసభ్యపదజాలంతో రచయితలపై దూషణ

  • పలువురు రచయితలపై దాడి

కేయూ క్యాంపస్‌, ఏప్రిల్‌ 28: హనుమకొండ, కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనెట్‌హాల్‌లో ఆదివారం ఘర్షణ వాతావరణం నెలకొంది. ‘లౌకిక విలువలు- సాహిత్యం’ అనే అంశంపై సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సును ఏబీవీపీ కార్యకర్తలు, పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. సదస్సు జరుగుతుండగా సెనెట్‌హాల్‌లోకి దూసుకొచ్చి రచయితల ప్రసంగాలను అడ్డుకున్నారు. సదస్సు నిర్వహణకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ నిర్వాహకులను నిలదీశారు.


సభావేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేశారు. ఈ క్రమంలో సమూహ కోకన్వీనర్‌ ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్‌ పసునూరి రవీందర్‌, నరేశ్‌కుమార్‌ సూపీ, కవయిత్రి మెర్సీ మార్గరేట్‌ను అసభ్య పదజాలంలో దూషించి వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ శ్రేణులను అక్కడి నుంచి బయటికి పంపించారు. ఆపై, సదస్సును ముగించుకుని రచయితలు బయటికి వస్తుండగా అక్కడే వేచి ఉన్న ఏబీవీపీ శ్రేణులు మరోమారు వారిని అడ్డగించారు. రచయితల వద్ద ఉన్న పుస్తకాలను గుంజుకున్నారు. సమూహ బాధ్యులు నరేశ్‌కుమార్‌ సూపీ మెడ పట్టి లాగారు, చొక్కాను గుంజారు.


ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పసునూరి రవీందర్‌, నరే్‌షకుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, ఏబీవీపీ శ్రేణులు చేసిన ఈ దాడిని సమూహ సదస్సు కో కన్వీనర్లు ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే, మెట్టు రవీందర్‌ తీవ్రంగా ఖండించారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సదస్సులోకి చొరబడిన ఫాసిస్టు మూక అల్లరి సృష్టించిందని, దాడికి పాల్పడి ముగ్గురు కవులను గాయపర్చిందని తెలిపారు. దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తితో సదస్సు జరుపుతుండగా ఫాసిస్టు మూక దాడులకు దిగడం భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి చేయడమేనని పేర్కొన్నారు. ప్రగతిశీల ఉద్యమాలకు కేంద్రమైన వరంగల్‌లో కవులపై దాడి జరగడాన్ని ఖండించాలని కోరారు. ఎన్నికల్లో ఫాసిస్టు శక్తులను అడ్డుకోవాలని కోరారు.

Updated Date - Apr 29 , 2024 | 03:57 AM