Share News

Kumaram Bheem Asifabad: సమస్యలకు నిలయంగా ఆశ్రమపాఠశాలలు

ABN , Publish Date - Nov 11 , 2024 | 10:41 PM

గిరిపుత్రులకు భోజనవసతితోపాటు మెరుగైనవిద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి.

Kumaram Bheem Asifabad:  సమస్యలకు నిలయంగా ఆశ్రమపాఠశాలలు

- దుప్పట్ల పంపిణీ లేదు.. వేడినీటి యంత్రాలు లేవు

- కనీస వసతులు లేక విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

గిరిపుత్రులకు భోజనవసతితోపాటు మెరుగైనవిద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన గిరిజన ఆశ్రమపాఠశాలలపై ఉన్నతాధికారులు నిర్లక్షవైఖరిని అవలంబిస్తుండడంతో పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు సమస్యలతో సహవాసం చేయల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. బోధనపై శ్రద్ధ తీసుకుంటున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. - వాంకిడి

జిల్లాలో 45 గిరిజన ఆశ్రమపాఠశాలలు ఉండగా 12,327మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, డైనింగ్‌హాల్‌, శుద్ధజలం, తదితర సమస్యలు వేధిస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు వేడి నీళ్లు అందించేందుకు ఏర్పాటుచేసిన సోలార్‌ వేడినీటి యంత్రాలు చెడిపోయి ఏళ్లు కావస్తున్నా అధికారులు మరమ్మతులు చేయడంలేదు. దీంతో విద్యార్థులు చన్నీళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చలికాలం కావటంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. పాఠశాలల్లో డైనింగ్‌హాల్‌ లేకపోవడంతో పాఠశాల ఆవరణలోని చెట్ల కిందనీడలో, గదుల ముందు వరండాల్లో విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు. వంటశాలలు లేకపోవడంతో వంటకాలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో తరగతి గదుల్లోనే విద్యార్థులు నిద్రించాల్సి వస్తోంది.

- పంపిణీ కాని దుప్పట్లు

కనిష్టస్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో పాఠశాలల్లో 200నుంచి 500లకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో కొందరు జ్వరం, జలుబు, చర్మవ్యాధులు, రక్తహీనతతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చలికాలం ఆరంభంలో పంపిణీచేసే దుప్పట్లు నేటివరకు ఐటీడీఏ అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో విరిగిన తలుపులు, ఊడిన కిటికీలతో ఆశ్రమపాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చలికి గజగజ వణు కుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అంతేగాక వసతిగృహాల్లో ఏఎస్‌ఎం పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సకాలంలో వైద్యం అందడంలేదు. విద్యార్థులకు రాత్రి, పగలు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆశ్రమపాఠశాలల్లో ప్రథమచికిత్స చేయడానికి ఏఎన్‌ఎంలు అందుబాటులో లేక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లక తప్పడంలేదు.

-మరుగుదొడ్లు, మూత్రశాలలు కరువు

జిల్లాలోని ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు, ఉన్న కొన్నిచోట అధ్వానంగా మారాయి. దీంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అనేక పాశాలలకు డైనింగ్‌ హాల్‌లేకపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలో వరండాల్లో, చెట్లకింద భోజనాలు చేస్తుండడంతో తరచూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో 571మంది విద్యార్థినులకు గాను కేవలం 20మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. బంబార ఆశ్రమ పాఠశాలలో 299మంది విద్యార్థులకు కేవలం 10మాత్రమే పనిచేస్తున్నాయి. ఇలా జిల్లాలోని అనేక ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. ప్రతిసంవత్సరం పాఠశాలల్లో అవసరంఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మా ణానికి సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు పంపించడమే తప్ప నిధులు మంజూరై నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు స్పందించి ఆశ్రమపాఠశాలల్లో అన్నివిధాల వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:41 PM