Kumaram Bheem Asifabad: బాబోయ్.. కోతులు..
ABN , Publish Date - Nov 20 , 2024 | 10:55 PM
ఆసిఫాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కోతులు గుంపులుగుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లు, దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్లచెట్లను ధ్వంసం చేస్తున్నాయి.
- వానరాల వీరంగం
- ఇళ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ
- భయందోళనలో ప్రజలు
- కోతుల నియంత్రణలో అధికారుల విఫలం
ఆసిఫాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కోతులు గుంపులుగుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లు, దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్లచెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందు తున్నారు. కోతుల నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఇళ్లలోకి చొరబడి వస్తువుల అపహరణ..
అడవిలో జీవించాల్సిన కోతులు ఊర్లమీద పడుతున్నాయి. అటవీ ప్రాంతాలు రోజురోజుకు తగ్గి పోవడం వాటికి అడవిలో ఆహారం లభించక గ్రామాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. గుంపులుగుంపులుగా కాలనీల్లో సంచరిస్తూ వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో తయారు చేసుకున్న భోజనలతోపాటు పప్పు దినుసులు పట్టుకెలుతున్నాయి. కిరణాషాపులు, పండ్ల దుకాణదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపులోని వస్తువులకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతుల బెడతతో పెంకుటిళ్లులు ధ్వంసం అవుతున్నాయి. అరుబయట ఎండబెట్టిన పప్పు దినుసులు ఇతర ఆహర పదర్థాలను వదలటంలేదు. ఇళ్లలో ఉన్న మామిడి, జామ, బొప్పాయి ఇతర పండ్ల చెట్లు, కూరగాయాల చెట్లను సైతం వదలకుండ ధ్వంసం చేస్తున్నాయి.
భయందోళనలో ప్రజలు..
కోతుల బెడద రోజురోజుకు ఎక్కువ కావడంతో పట్టణ వాసులు భయందోళనలకు గురవుతున్నారు. ఇళ్లలో చొరబడి వీరంగం సృష్టిస్తున్న కోతులను తరిమే ప్రయత్నంలో అవి ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాలలో కోతి కాటుకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మిద్దెల మీద గుంపులుగుంపులుగా ఒకచోట చేరి వచ్చిపోయే వారిపై పైపైకి వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతుల బెడద తీవ్రం కావడంతో కొంతమంది టపాసులు, పెద్ద శబ్ధాలు చేసి వాటిని తరిమి వేస్తున్నారు.
నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి..
పట్టణంలో కోతుల నియంత్రణ కోసం అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కోతులను బందించి పట్టణం నుంచి అటవీప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. కోతుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సివస్తుందని వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారినుంచి రక్షణ కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టి సారించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
కోతులతో ఇబ్బందులు పడుతున్నాం..
జ్యోతి, ఆసిఫాబాద్
కోతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందరవందరగా పడేసి వీరంగం సృష్టిస్తున్నాయి. పప్పుదినుసులు, ఆహార పదర్థాలు, కూరగాయాలు ఎత్తుకెళుతున్నాయి. వీటిని తరిమేందుకు ప్రయత్నిస్తే దాడులకు దిగుతున్నాయి. అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేట్టాలి.
అధికారులు చర్యలు తీసుకోవాలి..
- చిరంజీవి, ఆసిఫాబాద్
కోతుల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. కోతులు దాడులకు పాల్పడుతున్నాయి. వెంటనే వాటిని అటవీప్రాంతంలో వదిలిపెట్టే చర్యలు చేపట్టాలి.