Kumaram Bheem Asifabad: మూతపడ్డ సీఎఫ్‌సీ
ABN , Publish Date - Oct 09 , 2024 | 10:45 PM
వాంకిడి, అక్టోబరు 9: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మండలకేంద్రంలోని కామన్‌ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది.
- ప్రభుత్వ ఆర్డర్లు లేక కార్మికులకు ఉపాధికరువు
- పట్టించుకోని ఉన్నతాధికారులు..
- ఆందోళనలో కార్మికులు
వాంకిడి, అక్టోబరు 9: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న మండలకేంద్రంలోని కామన్‌ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. ఒకప్పుడు పనులతో కళకళలాడిన పరిశ్రమ నేడు ప్రభుత్వ ఆర్డర్లు లేక వెలవెల బోతోంది. ఈ పరిశ్రమపైనే ఆధారపడ్డ 60మంది కార్మికులు ఆందోళనకు గురవుతు న్నారు. గతేడాది పరిశ్రమ మూతపడి ఉండగా అప్పటి ఐటీడీఏ పీవోగా పనిచేసిన వరుణ్‌రెడ్డి, అదనపుకలెక్టర్‌గా పనిచేసిన చాహత్‌బాజ్‌పాయ్ సీఎఫ్‌సీ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకొని రూ. 3లక్షల విలువ చేసే కలప తయారీకి ఆర్డర్ ఇవ్వడంతో పరిశ్రమ తిరిగి తెరుచుకుంది. అనంతరం బెంగుళూరుకు చెరందిన బెల్(భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్) కంపెనీ నుంచి రూ.34లక్షల విలువ చేసే 500డ్యూయల్ డెస్క్‌లు ఆర్డర్ రావడంతో తిరిగి పరిశ్రమ గాడిన పడింది. గతేడాది అక్టోబర్ వరకు పనులు కొనసాగగా అనంతరం ఎలాంటి ఆర్డర్‌లు రాలేదు. అధికారులు దృష్టిసారిస్తే పరిశ్రమకు పూర్వవైభవం రానుంది.
- సీఎఫ్‌సీ ప్రస్థానం....
1971లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో రాష్ట్రంలో 56సీఎఫ్‌సీ(కామన్ ఫెసలిటీ సెంటర్) కేంద్రాలను ప్రారంభించారు. వాంకిడిలో 9వేల రూపాయలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని కేంద్రాలు మూతపడగా ఆదరణపొందిన ఈ సంస్థ మాత్రమే ఉనికిని చాటుకుని ఇన్నేళ్లు నడిచింది.
- ఫర్నీచర్ తయారీలో కార్మికులు దిట్ట..
కలపతో అందమైన వస్తువులు తయారు చేయడంలో ఇక్కడి కార్మికుల ప్రతిభ అమోఘం. భవనాలకు అమర్చే తలుపులు, కిటికీలు, టేబుల్లు, సోఫాసెట్‌లు, రాకింగ్‌చైర్లు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు తయారు చేస్తారు. వీటి రూపక్పనలో కార్మికులు తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. కలపతో ఫర్నీచరే కాకుండా ఇనుముతో బీరువాలు, బెడ్‌లు, డ్యూయల్ డెస్క్‌లు తయారుచేస్తుంటారు. ప్రస్తుతం కలప దొరకకపోతుండడంతో ఇనుముతోనే వస్తువులను తయారు చేస్తున్నారు.
- ప్రభుత్వ ఆర్డర్లు లేక కరువైన ఉపాధి..
2012లో పనులు లేక ఈ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. అప్పటి నుంచి జూలై 2015వరకు పరిశ్రమ మూతపడింది. ఆ తరువాత అప్పటి ఐటీడీఏ పీవో ఆర్‌వీ కర్ణన్ సీఎఫ్‌సీని సందర్శించి పరిశ్రమను పునరుద్దరించే దిశగా చర్యలు తీసుకున్నారు. రూ. 6లక్షల కార్పస్ నిధులను మంజూరి చేసి తిరిగి సీఎఫ్‌సీని పునర్‌ప్రారంభించారు. తరువాత ప్రభుత్వ అర్డర్లు లేకపోవడంతో తిరిగి పరిశ్రమ మూతపడింది. గత ఏడాది అప్పటి కలెక్టర్ రాహుల్‌రాజ్ రూ. 4.50 లక్షల బెంచిలు తయారు చేసేందుకు ఆర్డర్ ఇవ్వడంతో కొన్ని నెలల పాటు పరిశ్రమ కొనసాగింది. తరువాత ఆర్డర్లు లేక తిరిగి మూతపడింది. జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినట్లైతే సీఎఫ్‌సీకి పూర్వవైభం రానుంది.
- ప్రభుత్వ ఆర్డర్లు రావడంలేదు..
మడావి పైకాజీ, పర్యవేక్షకుడు
సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో ఉపాధి తగ్గింది. గతంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఫర్నీచర్ ఆర్డర్లు వచ్చేవి. దీంతో 60మంది కార్మికులకు ఉపాధి కలిగేది. గతేడాది వరకు అధికారులు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వడంతో పనులు సాగాయి. ప్రస్తుతం ఆర్డర్లు లేకపోవడంతో మూతపడింది. సీఎఫ్‌సీకి ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నాం.