Share News

Kumaram Bheem Asifabad: గజ...గజ...

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:41 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అడవుల జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్‌లో చలిపంజా విసురుతోంది.

 Kumaram Bheem Asifabad:  గజ...గజ...

- పడిపోతున్న ఉష్ణోగ్రతలు

- చలితో వణికిపోతున్న ఏజెన్సీవాసులు

- గిన్నెధరిలో అత్యల్పంగా 12.1డిగ్రీలు

- నెగళ్లతో ఉపశమం పొందుతున్న గ్రామీణులు

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అడవుల జిల్లా కుమరం భీం ఆసిఫాబాద్‌లో చలిపంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం జిల్లాలోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీనికితోడు గ్రామాల్లో పొగమంచు కమ్మేస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి. చిన్నారులు, వృద్దులు చలి నుంచి రక్షణ పొందేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. సాయంత్రం 6దాటితే జనాలు బయటికి వెళ్లనంత చలితీవ్రత పెరిగింది. ముఖ్యంగా అడవులు అధికంగా ఉన్న మండలాలైన తిర్యాణి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, బెజ్జూరు, చింతలమానెపల్లి, పెంచికలపేట, దహెగాం, కౌటాల, సిర్పూర్‌(టి), ఆసిఫాబాద్‌ ప్రాంతాల ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, జర్కిన్‌లు ధరిస్తున్నారు. గ్రామీణప్రాంతాల్లో ప్రజలు చీకటైతే చాలు ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి ఆసిఫాబాద్‌ ప్రాంతంలో చలితీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈసారి సీజన్‌లో చలి పంజా విసురుతుండడంతో జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌ కేంద్రం చీకటి పడితే చాలు జనాలు లేక బోసిపోతోంది. ఉదయం 9దాటితే కానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. తెల్లవారు లేవగానే పొలం పనులకు వెళ్లే రైతులు, పాలు పోసే వ్యాపారులు, పేపర్‌ బాయ్స్‌, వాకర్స్‌ చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలితీవ్రత ఒక్కసారిగా పెరగడంతో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణలేకుండా చలిలో బయటకు వెళ్లితే శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

గిన్నెధరిలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో పగలంతా వేడిమి ఉంటున్నా సాయంత్రం 6అయిందంటే చాలు చలి మొదలవుతోంది. సోమవారం జిల్లాలోని తిర్యాణి మండలం గిన్నెధరిలో 12.1డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే సిర్పూర్‌(యు)లో 12.3డిగ్రీలు, వాంకిడిలో 12.9డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 13.2డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

పెరుగుతున్న చలి తీవ్రత

జైనూర్‌: మండలంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చలి ధాటికి వృధ్ధులు, చిన్నారులు వణికిపోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజలు మంట కాగుతున్నారు. నిరుపేదలు రాత్రి సమయాల్లో చలికి చాలా ఇబ్బందులు పడుతు న్నారు. నవంబరులోనే ఇంత తీవ్రత ఉంటే, రానున్న రోజుల్లో చలిప్రభావం ఇంకేలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 10:41 PM