Kumaram Bheem Asifabad: గ్రీటింగ్...చీటింగ్
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:13 PM
బెజ్జూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఎక్కడ చూసినా అరచేతిలో సెల్‌ఫోన్. అది లేనిదే నిద్ర, తిండి కూడా ఉండదంటే నమ్మశక్యం కాదు.
- కొత్త సంవత్సరం.. విషెస్‌పై అప్రమత్తత అవసరం
- ఫేక్ లింకులు ఓపెన్ చేస్తే అంతే సంగతులు
- ఒక్క క్లిక్‌తో ఖాతాలో డబ్బులు మాయం
- రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
బెజ్జూరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఎక్కడ చూసినా అరచేతిలో సెల్‌ఫోన్. అది లేనిదే నిద్ర, తిండి కూడా ఉండదంటే నమ్మశక్యం కాదు. సెల్‌తోనే కాలక్షేపం.. ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా మొబైల్ ద్వారానే పంపిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో ఎంత భద్రంగా ఉన్నా ఏదో ఒకరకంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఖాతాలోని డబ్బులు మాయం అవుతున్నాయి. సాంకేతికత ఎంత పెరుగుతోందో మోసాలు కూడా అదేస్థాయిలో ఎక్కువవుతున్నాయి. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో బ్యాంకింగ్‌సేవలు సులువయ్యాయి. దాంతో క్షణాల్లో నగదు లావాదేవీలు సాగుతున్నాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై సంపూర్ణ అవగాహన ఉన్నవారు అతికొద్ది మందైతే.. పెద్దగా పరిజ్ఞానం లేనివారే చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారినే సైబర్ నేరస్థులు లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తూ నగదును కాజేస్తున్నారు. ఈతరహాలో మోసపోతున్న వారిసంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. ఖాతాదారులకు అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మోసగాళ్లు అదేస్థాయిలో రెచ్చిపోతూ కొత్తకొత్త మోసాలకు పాల్పడుతున్నారు. కాగా మరికొద్ది గంటల్లో రాబోతున్న నూతనసంవత్సరానికి వెల్కమ్ చెప్పేవాళ్లు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. న్యూఇయర్ విషెస్ పేరిట మొబైల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ ద్వారా సందేశాల లింక్‌లు పంపిస్తున్నారు. అయితే గుర్తుతెలియని నెంబర్ల ద్వారా వచ్చే ఈ లింక్‌లను ఏ మాత్రం క్లిక్ చేసినా మీ అకౌంట్లలో నగదును క్షణాల్లో మాయం చేస్తారని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నేపఽథ్యంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఏం చేస్తారంటే..
మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. ఈ రోజు అర్ధరాత్రి నుంచే విషెస్ హంగామా మొదలవుతుంది. బంధువులకు, శ్రేయోభిలాషులకు ఒకరికొకరు ఒక్కో విధంగా శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రణాళికలు చేసుకుంటారు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ మొబైల్‌లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాలతో మెసేజ్‌లు పంపుతారు. అయితే ఇదే అదునుగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు ఇక్కడే రంగంలోకి దిగుతారు. మీకు నచ్చే విధంగా మీ పేరుతో గ్రీటింగ్ సందేశాలను పంపుకోవచ్చని చెబుతూనే మీరు చేయాల్సిందల్లా ఈ కింద లింక్‌పై క్లిక్‌చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్‌లోని టెలిగ్రామ్, వాట్సాప్‌లకు ఫైల్స్ రూపంలో మెసేజ్‌లు పంపుతారు. పొరపాటున లింక్ ఓపెన్ చేస్తే అంతేసంగతులు. మన ఫోన్‌లోని సమాచారమంతా సైబర్ నేరగాళ్లకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వారికి చేరిపోతాయి.
అప్రమత్తతే రక్ష..
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఫోన్‌లోని సెట్టింగ్ ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు. మొబైల్ సెట్టింగ్‌లో ఫోన్ నంబర్లను యాక్సెస్ చేసే అనుమతి ఇవ్వరాదు. తెలియని ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయితే ఫోన్‌లో రీసెట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ మెయిల్స్, టెక్స్ట్, ఇతర సోషల్ మీడియా యాప్‌ల ద్వారా నకిలీ లింక్స్‌ను గుర్తించాలి. వాటిపై క్లిక్ చేయరాదు. మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్, ప్రోగ్రామ్స్, అధికారిక యాప్‌లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా సంబంధిత సంస్థలు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటాయి.
లింక్‌లపై జాగ్రత్తగా ఉండాలి..
- ప్రవీణ్‌కుమార్, ఎస్సై, బెజ్జూరు
అపరిచిత వ్యక్తులు పంపే ఫైళ్లను, మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు హాక్ చేస్తారు. న్యూ ఇయర్ విషెస్ చెప్పాలనుకునేవారు ఫోన్ ద్వారా మాట కలపడం, సందేశాన్ని పంపడం, వీలైతే వ్యక్తిగతంగా కలుసుకోవడం మంచిది. సైబర్ నేరగాళ్ల వలలోపడి మోసపోవద్దు. ప్రజలు వీటిపై అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో 1930నంబరును సంప్రదించాలి.