Kumaram Bheem Asifabad: అద్దె భవనాల్లో ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Nov 09 , 2024 | 10:57 PM
బెజ్జూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి.
- అరకొర వసతుల మధ్య అంగన్‌వాడీ కేంద్రాలు
- ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, గర్భిణులు
- పట్టించుకోని అధికారులు
బెజ్జూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు అద్దెభవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. గతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా భవనాలు నిర్మించేందుకు స్థలాలు లేకపోవడంతో నిర్మాణాలకు మోక్షం లభించడంలేదు. దీంతో అద్దె భవనాల్లో సరైన సదుపాయాలు లేక చిన్నారులు, గర్భిణులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం స్ర్తీ, శిశుసంక్షేమశాఖ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల కోసం అనేకపథకాలు అందిస్తోంది. పిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు చదువు చెప్పడం, ఆటలు ఆడించడం, నిద్ర పుచ్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. అద్దెభవనాల్లో అరకొరవసతులు ఉండటంతో చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపడం లేదు.
జిల్లాలో 973అంగన్‌వాడీ సెంటర్లు..
జిల్లా వ్యాప్తంగా 973అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 317కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 353అంగన్‌వాడీ కేంద్రాలు ఆయాగ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఒక గదిలో నిర్వహిస్తున్నారు. ఇక 303కేంద్రాలు అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయి. 0-7నెలల చిన్నారులు 4898, 7-12నెలల వారు 5695, 1-3సంవత్సరాల చిన్నారులు 17,809, 3నుంచి 6ఏళ్ల చిన్నారులు 20,682, గర్భిణులు 4609, బాలింతలు 4961మంది ఉన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు భవనాల చుట్టు పక్కల ఖాళీ స్థలం లేకపోవడం, గదులు ఇరుకుగా ఉండటంతో పిల్లలు ఉండలేని పరిస్థితి నెలకొంది. కొన్ని అద్దెభవనాల్లో మంచినీరు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. నీటి వసతిలేక అంగన్‌వాడీ ఆయాలు కేంద్రం నుంచి బయటకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పట్టణప్రాంతాల్లో రెండు, మూడు రోజులకోసారి నీటిని తెచ్చి నిల్వ ఉంచుకొని వాడుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రతినిత్యం బయటి ప్రాంతాల నుంచి తాగునీరు తీసుకరావడం ఇబ్బందిగా మారిందని అంగన్‌వాడీలు వాపోతున్నారు.
మరమ్మతులే దిక్కు..
జిల్లాలోని పలు అంగన్‌వాడీకేంద్రాలకు పక్కాభవనాల నిర్మాణాల కోసం రెండేళ్లక్రితం అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వాటిని నిర్మించేందుకు స్థలాలు లేక మోక్షం కలగడం లేదు. ప్రతీ అంగన్‌వాడీకేంద్రాన్ని ప్రాథమికపాఠశాల ఆవరణలో నిర్వహించాలని స్ర్తీశిశు సంక్షేమశాఖ నిర్ణ యించింది. ప్రభుత్వం సైతం ప్రాఽథమికపాఠశాలల్లో అంగన్‌వాడీకేంద్రాలను నిర్మించాలని సూచించింది. అయితే కేంద్రప్రభుత్వం నీతిఆయోగ్, శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ కింద 22కేంద్రాలకు మరమ్మతుల కోసం నిధులు మంజూరుచేసినా పనులు పూర్తికాలేదు. అదేవిధంగా సాక్ష్యం అంగన్‌వాడీ కింద మరమ్మ తుల కోసం ఒక్కో కేంద్రానికి రూ.2లక్షలు, టాయిలెట్ల మరమ్మతుల కోసం రూ.36వేలు, తాగునీటికోసం రూ.17వేలు, ఇతరపనుల కోసం 100కేంద్రాలకు రూ.36వేల చొప్పున నిధులు మంజూరు చేసినా పూర్తి స్థాయిలో పనులు కాలేదు. కొత్త అంగన్‌వాడీకేంద్రాలకు ఎలాంటి నిధులు మంజూరు లేక ఉన్న భవనా లకు మరమ్మతుల కోసం నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. అయినా అంగన్‌వాడీ కేంద్రాలను మరమ్మతులు చేపట్టని కారణంగా చిన్నారులకు అవస్థలు తప్పడం లేదు. మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు పూర్తికాక ఇబ్బందులు పడాల్సివస్తోంది. దీంతో ఇటు పాఠశాలల్లో కేంద్రాలు నిర్వహించడం వల్ల అంగన్‌వాడీకేంద్రాల చిన్నారులు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయినా అధికారులు భవనాలు నిర్మించడంలో నిర్లక్ష్యం వహించడంవల్ల ఇరు శాఖల వారు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిపాదనలు పంపించాం..
- ఆడెపు భాస్కర్, జిల్లా సంక్షేమాధికారి, ఆసిఫాబాద్
జిల్లాలోని అంగన్‌వాడీకేంద్రాలను పక్కాభవనాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపిం చాం. ఇప్పటికే పలుమార్లు నివేదికలు పంపినా నిధులు విడుదల కాలేదు. భవనాలు మంజూరయ్యే వరకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం భవనాలు లేనిచోట పాఠశాలల్లో కేంద్రాలను నిర్వహిస్తున్నాం. శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు చేయిస్తాం.